యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మంత్రి ఆదినారాయణరెడ్డికి కుటుంబ సభ్యులే ఎదురు తిరుగుతున్నారా? ఆయన వ్యవహారశైలిని అన్నదమ్ములే తప్పుపడుతున్నారా? అవును. ఇది నిజం. గత కొంతకాలంగా మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరులను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. తన తోడల్లుడు, కుమారుడికి ఇచ్చిన ప్రయారిటీ సోదరులకు ఇవ్వకపోవడంపై వారు కలత చెందారని సమాచారం. ఆదినారాయణరెడ్డి సోదరులు శివనాధ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మంత్రి తీరును తప్పపడుతున్నారు. ఇటీవల జమ్మలమడుగులో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల మధ్య వైరం దశాబ్దాల కాలం నుంచి ఉంది. షాద్ నగర్ జంట హత్యల కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో నడుస్తోంది. ఇందులో రామసుబ్బారెడ్డి నిందితుడు. ఈ నేపథ్యంలో ఈ కేసులో రాజీ పడాల్సిందిగా మంత్రి ఆదినారాయణరెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వత్తిడి తెచ్చారు. ఈ కేసులో రామసుబ్బారెడ్డికి శిక్ష పడితే ఆయన రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది పాలవుతుందని చంద్రబాబు ఆదినారాయణరెడ్డికి నచ్చ జెప్పగలిగారు. చంద్రబాబు ప్రతిపాదనకు ఆదినారాయణరెడ్డి ఓకే చెప్పారు. అయితే ఆది నిర్ణయాన్ని ఆయన సోదరులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.ఇన్నాళ్లూ వైరంతో ఉండి, న్యాయస్థానంలో పోరాటం చేస్తుంటే మంత్రి పదవి కోసం రాజీ పడటమేంటని ఆది సోదరులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగులో నిర్వహించిన ముఖ్య నేతల సమావేశానికి కూడా సోదరులిద్దరూ గైర్హాజరయ్యారంటే ఆది పట్ల వారు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్థమవుతూనే ఉంది. కేసు రాజీకి రావాలంటే అన్నదమ్ముల సహకారం అవసరం. వారు అంగీకరిస్తేనే కేసులో రాజీ పడే వీలుంది. ఇందుకు ఆదినారయణరెడ్డి ఒక ప్రతిపాదన కూడా గతంలో చేశారు. ఎమ్మెల్సీ పదవికి రామసుబ్బారెడ్డి రాజీనామా చేసి తన సోదరుడికి ఆ పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇందుకు రామసుబ్బారెడ్డి కూడా అంగీకరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.మరోవైపు ఎమ్మెల్యే టిక్కెట్ పై అసలు విషయం తెగడం లేదు. ఆదినారాయణరెడ్డి తాను తిరిగి పోటీలో ఉంటానని చెబుతున్నారు. రామసుబ్బారెడ్డి కూడా అదే మాట పదే పదే తన అనుచరులతో చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేసు రాజీపడితేనే ఆదికి టిక్కెట్ వస్తుందన్న లింకును చంద్రబాబు పెట్టారు. అయితే కేసులో రాజీ పడేందుకు సోదరులు అయిష్టంగా ఉండటంతో ఇప్పుడు ఏం చేయాలో ఆదికి పాలుపోవడం లేదు. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాజీ పడాలని ఆది పదే పదే సోదరులకు చెబుతున్నారు.అంతేకాకుండా ఆదినారాయణరెడ్డి తన కుమారుడు, తోడల్లుడిపై చూపిన శ్రద్ధ తమపై చూపడం లేదన్న అక్కసుతో వారున్నారు. మరి ఆదికి కుటుంబంలోనే విభేదాలుతల్తెత్తాయి. మరి ఏంజరుగుతుందో చూడాలి.