యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నలభై సంవత్సరాల అనుభవం గల నాయకుడు అయిన నారా చంద్రబాబునాయుడు తన రాజకీయ జీవితంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సంక్లిష్టమైన సమస్యలతో సతమతమవుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ అంతరంగంలో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన వెంటాడుతోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఒక్క మిత్రపక్షమూ లేకపోవడం, శత్రువులు నలువైపులా మట్టడి చేస్తుండటంతో తెలుగుదేశం అధినేత కంగారు పడుతున్నారు. తెలుగుదేశం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటిదాకా మిత్రులతో కలసి పోటీ చేస్తోంది. వామపక్షాలు, బీజేపీతో కలసి ఒకసారి, ఒక్కోసారి వేర్వేరు పార్టీలతో కలసి ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవం సైకిల్ పార్టీకి ఉంది. ఆ మాట కొస్తే ఎన్టీఆర్ 1983లోనే మేనకాగాంధీ ఆధ్వర్యంలోని సంజయ్ విచార్ మంచ్ తో పొత్తుపెట్టుకుని పోరాడారు. 2009లో టీఆర్ఎస్, వామపక్షాలతో కలసి మహాకూటమిగా ఏర్పడి బరిలోకి దిగారు. 2014లో పవన్, బీజేపీలతో కలిసి నడిచారు. కానీ తాజా ఎన్నికల్లో టీడీపీ వెంట వచ్చే మిత్రపక్షం ఒక్కటీ లేదు. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ ఆసక్తిగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సీపిఎం, సీపీఐ, బీజేపీ, వైసీపీ, జనసేనలతో టీడీపీకి బద్ధవైరం తెలిసిందే. జనసేనతో లోపాయికారీ అవగాహన ఉండొచ్చన్న ప్రచారం సాగుతున్నప్పటకీ అది ఆచరణలో ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి.2014లో ఎవరు ఎంత కాదన్నా చంద్రబాబుకు అధికారం సాధించిపెట్టడంలో బీజేపీ, జనసేన ప్రభావం స్పష్టంగా ఉందన్న సంగతి అందరికీ తెలుసు. టీడీపీ వర్గాలు ఇందుకు భిన్నమైన వాదన విన్పిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయని, అందువల్ల బీజేపీ, పవన్ లేకపోయినా అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి ఉండేవారమని పార్టీ శ్రేణులు వాదిస్తున్నాయి. ఇది కొంతవరకూ వాస్తవమే అయినప్పటికీ బీజేపీ, పవన్ లేకపోతే అసెంబ్లీ ఎన్నికల పరిస్థితి అంత సాఫీగా ఉండేది కాదు. అప్పట్లో మోదీ గాలి బ్రహ్మాండంగా వీస్తుంది. దేశ వ్యాప్తంగా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ ప్రభావం తెలుగుదేశం పార్టీకి మేలు చేసిన మాట వాస్తవం. ఇక జనసేన నేత పవన్ కల్యాణ్ ప్రభావాన్ని తక్కువగా చేసి చూడటం కూడా పొరపాటే. కాపు యువత పూర్తిగా ఆయన వెంట నడిచింది. ఫలితంగా ఆ సామాజిక వర్గంప్రభావం గల ప్రాంతాల్లో టీడీపీ విజయం సాధించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ స్వీప్ చయడం ఇందుకు నిదర్శనం. కొన్ని ఇతర జిల్లాల్లోనూ తెలుగుదేశం పార్టీ లబ్ది పొందింది.ప్రస్తుత ఎన్నికలకు వస్తే ఎటు చూసినా టీడీపీ అధినేతకు ఇబ్బందులే కనపడుతున్నాయి. 1978లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు అనతికాలంలోనే ఎదిగిపోయారు. తన రాజకీయ చతురత, వ్యూహ నైపుణ్యం, ఎత్తులు, పోల్ మేనేజ్ మెంట్ ద్వారా ఎన్నో ఎన్నికలను అవలీలగా అధిగమించారు. కానీ ఈసారి మాత్రం అంత తేలిక కాదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వారు ఇందుకు చూపుతున్న కారణాలను కొట్టిపారేయలేం. మొదటిది ఈసారి సైకిల్ పార్టీ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగనుంది. పార్టీ ఆనవాయితీ, సెంటిమెంటుకు భిన్నమైన పరిస్థితి. ఇక సామాజికవర్గాల పరంగా చూస్తే సంప్రదాయ బీసీలు, కాపులు, అగ్రవర్ణాల్లోని బ్రాహ్మణులు, వైశ్య వంటి వర్గాలు 2014లో బాబువైపే నిలిచాయి. ఈసారి ఆ వర్గాలు పూర్తిగా దూరమవ్వడం సైకిల్ కు చిక్కులు కలిగించనున్నాయి. రాష‌్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబు వంటి సమర్థ నేత నాయకత్వం అవసరమన్న భావనతో తటస్థ వర్గాలు గత ఎన్నికల్లో ఆయన వైపే నిలిచాయి. అనుభవం లేని జగన్ కన్నా సీనియర్ చంద్రబాబే మేలన్న అభిప్రాయం అప్పట్లో ప్రజలకు ఉండేది. ఈసారి అలాంటి పరిస్థితి లేదని క్షేత్రస్థాయి పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేల అవినీతి నియోజకవర్గాల్లో తారాస్థాయికి చేరుకోవడంతో పార్టీ శ్రేణులే భయపడుతున్నాయి. ఇది యావత్ పార్టీపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రంపై దుమ్మెత్తి పోయడం ఎంతవరకూ మేలు చేస్తుందన్నది ప్రశ్నార్థకమే. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి కేంద్రాన్ని, ముఖ్యంగా మోదీని బలిపశువుగా చేయాలన్న దోరణిలో బాబు ఉన్నట్లు చెబుతున్నారు. కేంద్రం సాయం చేయని మాట కొంతవరకూ వాస్తవమే అయినప్పటికీ, కేంద్రం అసలు ఏమీ చేయలేదన్న వాదనను ప్రజలు పూర్తిగా అంగీకరించే పరిస్థితి లేదు. చంద్రబాబు అవకాశవాద వైఖరిని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పై పోరాటం చేసి ఇప్పుడు అదే పార్టీతో రాసుకుపూసుకు తిరగడాన్ని ప్రజలు హర్షించడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. ఇంతటి విస్తృత నేపథ్యంలో దేశంలో అత్యంత సీనియర్ నాయకుడినని చెప్పుకుంటున్న చంద్రబాబు చాణక్యం రేపటి ఎన్నికల్లో ఎంతవరకూ పనిచేస్తుందన్నది ప్రశ్నార్థకమే.