Highlights
- యువత లక్షణాలఫై ఉదాహరణ
- ఐపీఎస్ అధికారి సిబిఐ జేడీ లక్ష్మినారాయణ
- పది సూత్రాలు
మిస్సైల్‌మేన్ ఏపీజే అబ్దుల్ కలాం... పాల విప్లవం తీసుకొచ్చిన వర్గీస్ కురియన్... హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్, ప్రపంచానికి భారతదేశ గొప్పదనం చాటిచెప్పిన వివేకానందుడు.... ఈ మహానుభావులంతా పైనుంచి దిగిరాలేదు. వారంతా మనలో ఒక్కరే... వారు సాధించింది... మనం ఎందుకు సాధించలేకపోతున్నాం.. మనలో శక్తి లేదా..? మన మనసు చెడు అలవాట్ల వైపు ఎందుకు మరలుతోంది.. సంకల్పం లేదా..? వూరికే నిరుత్సాహ పడి ఎందుకు ఒత్తిడిలో కూరుకుపోతున్నాం..? గెలిచే సత్తా లేదా..? అంటే ఉంది.... అన్నీ ఉన్నాయి. కావల్సింది నిర్మలమైన మనసు. సాధించాలనే కసి... ముందుకు సాగాలన్న పట్టుదల.. మాత్రమే..
తిరుపతి వేేంకటేశ్వర యూనివర్సిటీ ఆడిటోరియంలో శనివారం అకాడమి ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన యువత సాధికారిత అనే కార్యక్రమంలో మహారాష్ట్రలోని థానేనగర జాయింట్ కమిషనర్, ఐపీఎస్ అధికారి( సిబిఐ జేడీ) లక్ష్మినారాయణ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. సుమారు గంట ఇరవై అయిదు నిమిషాలు సాగిన ప్రసంగాన్ని మూడువేల మంది విద్యార్థులు, ఇతరులు ఆసక్తిగా విన్నారు. ఆయన నుంచి ఇంకా కొత్త విషయాలు వస్తాయన్న ఆత్రుత వారిలో కనిపించింది. యువత లక్షణాలు ఎలా ఉండాలో చక్కటి ఉదాహరణలతో వివరించారు.
1. సమయం గొప్ప ఆయుధం
సమయం విలువైంది. మనం ఒక సెకనే కదా.. అనుకుంటాం... ఆ సెకను విలువను ఒలింపిక్స్‌లో 4వ స్థానంలో వచ్చిన వార్ని అడుగు... అది ఎంత గొప్పదో చెబుతారు.... ఒక నిమిషమే కదా..? వృథా అని చాలా సులభంగా తీసుకుంటాం.. సమయం మనకు ఒక గొప్ప ఆయుధం. దాన్ని వృథా చేయడం మంచిది కాదు.
2. మంచి స్నేహాన్ని ఎంచుకోవడం
వర్షపు చుక్క చేతిలో పడితే నీరు అవుతుంది... బురదలో పడితే మురుగుగా మారుతుంది. అదే చుక్క తామరాకుపై పడితే దాని అసలు స్వరూపం చక్కగా తెలుస్తుంది. ఇక అదే వర్షపు బిందువు ఆలుచిప్పలో పడితే ముత్యం అవుతుంది. మనమంతా వర్షపు చుక్కలే. పైనుంచి దిగిన వర్షపు చుక్కకు తాను ఎక్కడ పడాలో ఎంచుకునే అవకాశం లేదు. మనకు మాత్రం అది ఉంది. మంచి స్నేహాన్ని.. మంచి మనుషుల సాంగత్యాన్ని ఎంచుకోవడంలో మన నేర్పు కనిపిస్తుంది.
3. జన్మ సార్థకత...
ఒకసారి నారథుడు భగవంతుడ్ని అడుతాడు... అసలు సత్సంగం అంటే ఏమిటి స్వామి అని...? ఆయన జవాబిస్తూ.. వెళ్లి ఒక కీటకాన్ని అడుగు చెబుతుంది అంటాడు. వెంటనే నారథుడు కీటకాన్ని అడగగానే అది చనిపోతుంది. చనిపోయిన విషయం భగవంతుడికి చెప్పగానే.. ఈ సారి పావురాన్ని అడగమంటాడు.. నారథుడు అడగగానే అదీ మరణిస్తుంది. భయంతో దేవుడికి విషయం చెప్పగానే ఈసారి లేగదూడను అడుగు అంటాడు. నారదుడు ఈ మాట ఎత్తగానే అదీ చనిపోతుంది. ఇక భయంతో భగవంతుడికి విషయం చెప్పగానే... ఈసారి అప్పుడే పుట్టిన రాజకుమారుడ్ని సత్సంగం గురించి అడగమని చెబుతాడు. భయంతోనే వెళ్లిన నారథుడు రాజకుమారుడ్ని అడగగానే... అతడు నవ్వుతూ మీరు నా దగ్గరకు వచ్చి మాట్లాడటమే సత్సంగం అని... గత జన్మలో కీటకంగా, మరో జన్మలో పావురంగా, ఇంకో జన్మలో లేగదూడగా పుట్టిన నన్ను అద్భుతమైన మానవజన్మలోకి తీసుకొచ్చింది మీ సత్సంగమే స్వామి అని ఆ చిన్నారి బదులిస్తాడు. 84 లక్షల ప్రాణుల్లో అద్భుతమైన జన్మ మానవజన్మ. దీన్ని కచ్చితంగా సార్థకం చేసుకోవాలి...
4. తపనతో బయటకు వచ్చే శక్తి
ఆంజనేయుడికి ఎంతటి శక్తి ఉందో అతడికే తెలీదు. అవసరమైన సమయంలో తన తోటివారు అవసరం మేరకు ప్రోత్సహించి శక్తిని ఆయనకు తెలియజేశారు. దీంతోనే ఆయన సీతమ్మను తీసుకురావడం.. సంజీవని పర్వతం ఎత్తుకొని తీసుకురావడం చేశారు. ప్రతి వ్యక్తిలోనూ శక్తి ఉంటుంది. అది మీలోని పట్టుదల, సాధించాలనే తపనతోనే బయటకు వస్తుంది.
5. అనవసర విషయాలను తొలగించండి
నేను ఒకసారి ఓ పట్టణానికి వెళ్లాను. అక్కడ ఓ శిల్పి అద్భుతమైన కళాఖండం చెక్కడం చూశా. ఎలా చెక్కారనే శిల్పకళాకారుడ్ని నేను అడిగాను. అప్పుడు ఆయన ఒక మంచి విషయం చెప్పాడు. ఆ రాయిలోనే శిల్పం దాగుందని.. అతడు కేవలం అనవసరమైన రాయిని తొలగించి.. దానికి ఒక రూపు తీసుకొచ్చానని బదులిచ్చాడు. నిజంగా ఇది యువతరానికి బాగా అవసరం. మనలోని అనవసర విషయాల్ని తొలగించి చూడండి. అద్భుతాలు జరుగుతాయి.
6. ఒకే పనిపై దృష్టి పెట్టు
స్వామి చిన్మయానంద గొప్ప వ్యక్తి... ఆయనను ఒక రోజు తన శిష్యుడు ఒక మాట అడిగాడు. స్వామి.. నేను భోజనం చేస్తాను.. చదువుతాను.. కాని మీలాంటి జ్ఞానం నాకు ఎందుకు రాలేదు..? అని అంటాడు. దానికి స్వామి బదులిస్తూ.. నేను చదివేటపుడు మా మెదడులోకి మరేది రాదు. కేవలం చదువు మీదనే దృష్టి పెడతాను. భోజనం చేసేటపుడు అంతే.. మరో ఆలోచన లేకుండానే సంతృప్తిగా భోజనం చేస్తానని బదులిచ్చాడు. ఇది నిజం. మనమంతా టీవీ చూస్తూ భోజనాలు చేస్తున్నాం.. క్రైం సీన్లు చూస్తూ అల్పాహారం తింటున్నాం. మనం తింటున్నది భోజనం కాదు.. టీవీలను.. క్రైం సంఘటనలను.. ఇది కూడా నేర ఆలోచనలు పెరడానికి ఒక కారణమే.
7. సాధన వృథా కాదు.
ప్రపంచ ప్రఖ్యాత ఈతగాడు మైకెల్ ఫెల్ప్ ఒకే ఒలింపిక్స్‌లో 8 బంగారు పతకాలు సాధించాడు. ఒకసారి ఫెల్ప్ మణికట్టుకు గాయమైంది. అది పెద్ద గాయం. మూడు నెలలు ఈతకు దూరంగా ఉండాలని వైద్యులు చెప్పారు. అయితే మనసు ఆగని ఫెల్స్ ప్రతిరోజు ఈతకొలను దగ్గరకు వెళ్లడం కాళ్లు నీళ్లలో పెట్టి ఆడించడం చేసేవాడు. సుమారు మూడు గంటలు ఇలా చేశాడు. దీంతో అతడి కాళ్ల కండరాలు బలంగా తయారయ్యాయి. చివరి 3 నెలలు అయిపోయాయి. ఒలింపిక్స్ వచ్చాయి. 7 బంగారుపతకాలు గెలిచి, 8వ బంగారుపతకం బటర్‌స్ట్రోక్‌కు తలపడుతున్న సమయంలో ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చాడు. చివరి 5 మీటర్లలో ఫెల్ప్ అనూహ్యంగా ముందుకొచ్చి 8వ పతకం సాధించాడు. కారణం విశ్లేషకులు పరిశీలించగా.. అతడి కాళ్లు చాలా బలంగా ఉండటం వల్లే చివరి 5 మీటర్లలో అతడు విజయాన్ని అందుకున్నాడని తేలింది. మనం మంచి కోసం చేసే సాధన ఏదీ వృథా కాదు. ఒకసారి కాకపోతే మరోసారి అది కచ్చితంగా మనకు ఉపయోగపడుతంది.
8. కసి ఉండాలి.
వర్గీస్ కురియన్ పాలవిప్లవం తీసుకొచ్చిన వ్యక్తి. అతడు లండన్‌లో ఉండగా ఒకసారి అక్కడున్న విదేశీయుడు ఒకరు భారతదేశం పాలు మురుగుకాలువలో పోయడానికి మాత్రమే పనికొస్తాయని అన్నాడు. తన దేశాన్ని అన్న అతడి మాటలు కురియన్‌లో కసిని రేపాయి. వెంటనే గుజరాత్ వచ్చి మారుమూల పల్లెలకు సైతం వెళ్లి పాలవిప్లవానికి శ్రీకారం చుట్టారు. విజయం సాధించారు. చదువు, కెరీర్‌లోనూ అదే కసి యువతకు అవసరం.
9. వినూత్నంగా ఆలోచించండి..
మైఖెల్ జోర్డాన్ అమెరికాలో మంచి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు. అతడికి చిన్నతనంలో తండ్రి ఒక డాలర్ విలువ చేసే టీషర్టు ఇచ్చి దాన్ని 2 డాలర్లకు అమ్మాలని చెబుతాడు. ఏమీ ఆలోచించని జోర్డాన్ ఆ టీషర్ట్ వేసుకొని వెళ్లి గిటార్ వాయిస్తూ రెండుడాలర్లను సంపాదిస్తాడు. ఆ తర్వాత అదే టీషర్డును 100 డాలర్లకు అమ్మాలని తండ్రి చెబుతాడు. ఏం చేయాలో తెలియక అప్పట్లో ఆదరణ ఉన్న మీక్కడోనాల్డ్ కార్టూన్లను ఆ టీషర్టుపై వేసి.. అమ్మకానికి పెడతాడు. వెంటనే ఓ వ్యక్తి 100 డాలర్లకు దాన్ని కొనుక్కుంటాడు. ఆ డబ్బును తీసుకెళ్లి అతడి తండ్రికి ఇస్తే ఈ సారి 500 డాలర్లు తీసుకురావాలని మరో టీషర్టు ఇస్తాడు. జోర్డాన్ ఆలోచించి వెంటనే నగరంలో ఉన్న మైకెల్ జాక్సన్‌ను ఎలాగోలా కలిసి ఆ టీషర్టు మీద ఆటోగ్రాఫ్ తీసుకొని.. వేలానికి పెడతాడు. అది 500 డాలర్లకు అమ్ముడవుతుంది. ఒకే టీషర్టును జోర్టాన్ వినూత్న ఆలోచనలు, కాస్త కష్టపడటంతో అతడి దాని విలువను పెంచగలిగాడు. యువతకు ఇలాంటి ఆలోచనలు రావాలి. అప్పుడే పోటీ ప్రపంచంలో రాణించగలరు.
10. స్వార్థం వీడి.. దేశం కోసం పాటుపడండి..
అలెగ్జాండర్ తాను చనిపోయిన తర్వాత తన శవపేటికను తనకు వైద్యం చేసిన వైద్యులే మోయాలని కోరాడు. తాను సంపాదించిన వజ్రవైడూర్యాలు తాను చనిపోయినపుడు తీసుకెళ్లేమార్గంలో పోయాలని సూచించాడు. చివరిగా సమాధిలో పడుకోబెట్టే సమమంలో తన రెండు చేతులను బయటపెట్టాలని కోరాడు. విశ్వవిజేత అయినా.. నేనేమీ తీసుకెళ్లడం లేదని అందరికీ తెలియాలని చెప్పాడు.