యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశరాజకీయాలకు రోల్ మోడల్స్ గా మారారు. వ్యాపారనిర్వహణకు అనువైన రాష్ట్రాలుగా, పెట్టుబడులను ఆకర్షించే అగ్ర ప్రాంతాలుగా పేరు తెచ్చుకోవడమే కాదు, రాజకీయాల్లోనూ వీరిద్దరూ ఒక రేంజ్ లో వెలిగిపోతున్నారు. సంక్షేమ పథకాలు మొదలు సమర్థనేతలుగా నిరూపించుకోవడం వరకూ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. పాజిటివ్ గానే కాదు, నెగటివ్ విషయాల్లోనూ వీరిదే రికార్డు. అయితే ఒకరికొకరు పోటీ పడుతుండటమే విచిత్రం. రెండు భిన్నమైన మార్గాలను సూచిస్తూ ఉండటంతో ఎవరిని అనుసరించాలనే విషయంలో ప్రాంతీయ పార్టీల నేతలు కొంత సందిగ్ధతకు లోనవుతున్నారు. చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లు అనుసరించే విధానాలు వైవిధ్యపూరితమైనవి. పరిపాలన పరంగా చంద్రబాబు ప్రపంచంలోని అత్యంత అధునాతన పరిజ్ణానాన్ని వినియోగించుకోవాలని చూస్తారు. క్షేత్రస్థాయి నుంచి తానే ఒక కొత్త పంథాను సృష్టించాలని యోచిస్తారు కేసీఆర్. ఓటు పాలిటిక్స్ లో వీరిద్దరూ జాతీయ పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారారు. వీరి వ్యూహాలు, ఎత్తుగడలు అంతుచిక్కక అల్లాడిపోతున్నాయి ప్రధాన జాతీయపక్షాలు .తన బలం, బలహీనత బాగా తెలిసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ప్రజల్ని విపరీతంగా ఆకర్షించే పొలిటికల్ గ్లామర్ శూన్యం. ప్రజల్ని తన ఉపన్యాసాలతో ఆకట్టుకునే వాగ్ధాటి మృగ్యం. అయినా ప్రజల్లో నిరంతరం ఉంటూ వారిని మెప్పించే కళలో ఆరితేరిపోయారు. సంబరం, సంతోషం, తిరునాళ్లు, ఉత్సవాలు, విషాద ఘట్టాలు, ప్రకృతి విపత్తులు ఏది చోటు చేసుకున్నప్పటికీ చంద్రబాబు మార్కు రాజకీయానికి అవి ప్రధాన వేదికలే. ఆయా సందర్భాలను తన పనితీరుకు నిదర్శనాలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తుంటారు. పార్టీ పరమైన బలహీనతలు బయటపడకుండా ప్రబలమైన శక్తిగా దూసుకుపోతోందనే భావనను ప్రజల్లో కలిగిస్తారు. సొంత కార్యకర్తలకూ అదే విషయాన్ని నూరిపోస్తారు. సొంతంగా ఎన్నికలకు వెళితే పరాభవం ఎదురవుతుందని తెలిసిన ఏకైక నాయకుడు. అందుకే రాజకీయ గాలిని పట్టుకుంటారు. దానికనుగుణంగా తన పొలిటికల్ బోటును మలుపుతిప్పుతుంటారు. ప్రతికూల పరిస్థితులను అనుకూలం చేసుకుంటూ విజయం సాధిస్తుంటారు. నిజానికి పార్టీ, నాయుడి సొంతబలం కంటే చంద్రుని సమన్వయ సామర్థ్యం, సరైన టైమింగులో సరైన పార్టనర్ తో జట్టు కట్టడంలోనే విజయరహస్యం దాగి ఉంది.టీడీపీ స్కూలు నుంచి వచ్చిన వ్యక్తే కేసీఆర్. రాజకీయాంశాలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులకు గతంలో శిక్షణ కూడా ఇస్తుండేవారు. చంద్రబాబు నాయుడి తరహాలో నాన్చుడు ధోరణికి వ్యతిరేకం. తాడోపేడో తేల్చుకోవడానికే సిద్ధపడతారు. అనేకసార్లు డక్కామొక్కీలు తిన్నప్పటికీ అంతిమంగా సాహసమే గెలుపు సాధించిపెడుతోంది. ప్రతికూల పరిస్థితుల్లో పదవులకు రాజీనామాలు చేయడం, అంతా బాగున్నప్పటికీ అసెంబ్లీని రద్దు చేసి ప్రజాతీర్పు కోరడం , మంత్రివర్గమే లేకుండా నెలలతరబడి పాలన చేయడం వంటివన్నీ మొండితనానికి నిదర్శనాలే. ప్రజల్లో అపారమైన మద్దతు రావడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలే కారణంగా నిలిచాయి. సాహసం, తెగింపు చిరునామాగా మార్చుకోగలిగారు. అయినప్పటికీ దూకుడు నిర్ణయాలు అనేక సందర్భాల్లో వికటించిన ఘట్టాలూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఒంటరిగా పార్టీని పోటీలోకి తీసుకెళ్లడానికి సాహసించరు. కానీ కేసీఆర్ సాధ్యమైనంతవరకూ ఒంటరిపోరునే ఇష్టపడతారు. క్రెడిట్ వేరేవాళ్ల ఖాతాలో పడటాన్ని కేసీఆర్ ఇష్టపడరు. జాతీయ పార్టీలతో బహిరంగంగా చేతులు కలిపితే గతంలో తన బలం క్షీణించింది. అందుకే బీజేపీ స్నేహహస్తం చాస్తున్నప్పటికీ దూరం పెడుతున్నారు.సంక్షేమం కచ్చితంగా ఓట్లు సంపాదించి పెట్టే సాధనంగా ఇద్దరూ గుర్తించారు. రుణమాఫీ, నిరుద్యోగభృతి వంటి వాటిని ఇద్దరూ అనుసరిస్తున్నారు. రైతుబంధును కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఏపీలోనూ అదే దిశలో కసరత్తు. ఒకరిని చూసి మరొకరు వాతలు పెట్టుకుంటున్నారనేది రాజకీయ విమర్శ. అప్పులు అదిరిపోతున్నా, ఖజానా దివాళా తీస్తున్నా పట్టించుకోవడం లేదు. అయితే వీటిని మిగతారాష్ట్రాలు సైతం అనుసరించకతప్పని అనివార్యతను కల్పిస్తున్నారు. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. చంద్రబాబు నాయుడు కాంగ్రెసుతో కలిసినడుస్తున్నట్లు కనిపించినా తనను డామినేట్ చేసేస్తాడేమో అనే అనుమానం హస్తం పార్టీలో ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్రాల హక్కులు , ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఆకర్షణీయమైన నినాదంతో తో కేసీఆర్ విసురుతున్న వల తమను ముంచుతుందేమోననే భయం అటు బీజేపీని, కాంగ్రెసును వేధిస్తోంది. చంద్రబాబు తెలివిగా బీజేపీ, మోడీ బూచిలను చూపిస్తూ అందర్నీ ఒకే ఫ్లాట్ ఫారం మీదకు రమ్మంటున్నారు. కేసీఆర్ కాంగ్రెసు, బీజేపీ రెంటినీ కాదంటున్నారు. ఇద్దరి పిలుపులూ ఆకర్షణీయంగానే ఉంటున్నాయి. ఆచరణాత్మకంగా కనిపిస్తున్నాయి. కవ్విస్తున్నాయి. కానీ ఎటువైపుపోవాలో ప్రాంతీయపార్టీలకు అంతుచిక్కడం లేదు. సంక్షేమ పథకాల విషయంలో వీరిద్దరిదీ ఒకటే మార్గం . దానిని అనుసరించడంలో పెద్దగా ఇబ్బందులు లేవు. అయితే రాజకీయ పంథా మాత్రం ప్రాంతీయనేతలకు పరీక్ష పెడుతోంది.