యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
ఈ ఏడాది ప్రకటించిన జాబితాలో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ (సర్ గ్యార్‌ఫీల్డ్స్ ట్రోఫీ), ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను కోహ్లీ చేజిక్కించుకున్నాడు. (ఐసీసీ) ప్రతీ ఏడాదీ ప్రకటించే అవార్డుల్లో ప్రతిష్టాత్మక అవార్డులన్నింటినీ దక్కించుకుని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్రను లిఖించాడు. ఇన్నేళ్ల చరిత్రలో ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఐసీసీ ప్రకటించే ప్రతిష్టాత్మక వ్యక్తిగత అవార్డులన్నింటినీ ఈ ఏడాది కోహ్లీయే దక్కించుకున్నాడు. కాగా, ప్రతిష్టాత్మక ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ (సర్ గ్యార్‌ఫీల్డ్స్ ట్రోఫీ)ను గతేడాది కూడా కోహ్లీయే దక్కించుకోవడం విశేషం.
మరోవైపు 2018 ఏడాదికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన పురుషుల టెస్టు, వన్డే జట్లను ప్రకటించింది. గతేడాది అటు బ్యాట్స్‌మన్‌గా.. ఇటు సారథిగా అద్భుత ప్రదర్శన కనబరిచిన విరాట్.. ఈ రెండు జట్లకు సారధ్య బాధ్యతలు సంపాదించుకోవడం విశేషం. ఐసీసీ ఓటింగ్ అకాడమీ ద్వారా ఈ జట్లను ప్రకటించారు. ఈ అకాడమీలో మాజీ ఆటగాళ్లు, మీడియా, బ్రాడ్‌కాస్టింగ్ సభ్యులు ఉంటారు.