యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తితిదేలో జరుగుతున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలంటూ భాజపా నేతలు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్ భవన్‌లో తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి గవర్నర్‌ను కలిశారు. తితిదేలో రోజురోజుకూ అవినీతి పెరిగిపోతోందని.. దీనిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రమేయంతోనే ఈ అవకతవకలు జరుగుతున్నాయన్నారు. గతనెలలో టికెట్ల కుంభకోణం జరిగినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ఇప్పటి వరకూ బాధ్యులను అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విజిలెన్స్,ఈడీని విచారణకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరామని లక్ష్మణ్ వివరించారు. వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తిరుమలకి వస్తారని.. వారు ఎంతో నమ్మకంతో భారీగా కానుకలు సమర్పించుకుంటారన్నారు. అలాంటి వారి నమ్మకాలను దెబ్బతీస్తున్నారని దత్తాత్రేయ విమర్శించారు. అక్రమార్కులు టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముతూ రూ.కోట్లు దండుకుంటున్నారని.. ఈవోకే పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలన్నారు.