యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కుమార్తె రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. బుధవారం అమరావతిలో కుమార్తెతో పాటూ చంద్రబాబును కలిసిన అనంతరం జలీల్‌ఖాన్ ఈ విషయాన్ని తెలిపారు. షబానా ఖాతూర్ విజయవాడ వెస్ట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో గెలిచి పశ్చిమ స్థానాన్ని చంద్రబాబుకు కానుకగా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. అమెరికాలో ఉంటున్న తన కుమార్తె.. అక్కడ టీడీపీ సెక్రటరీ పదవిలో ఉన్నారని చెప్పారు జలీల్‌ఖాన్. ఎన్నికల్లో షబానా పోటీ చేసినా.. రాజకీయాల్లో కొనసాగుతానంటున్నారు జలీల్‌ఖాన్. తాను ఇంకా రిటైర్ కాలేదని.. తన సేవలను పార్టీకి వినియోగించుకుంటామని చంద్రబాబు చెప్పారన్నారు. అధినేత ఆదేశిస్తే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై పోటీ చేసేందుకు సిద్ధమంటున్నారు జలీల్‌ఖాన్. చంద్రబాబు అంటే తనకు ఎంతో అభిమానమన్నారు షబానా ఖాతూర్. అమెరికాలో ఉంటున్న తాను తిరిగి రాష్ట్రానికి వచ్చేశానని.. రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేయాలనే ఆశ ఉందన్నారు. త్వరలోనే తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభిస్తానని చెప్పారు. తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.