యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కేరళ వరద బాధితులకు ఇచ్చిన పలు చెక్కులు బౌన్స్ అయ్యాయి. కేరళ వరద సహాయ నిధికి వచ్చిన రూ. 3.26 కోట్ల విలువైన చెక్కులు, డీడీలు చెల్లకుండా పోయాయి. 2018లో కేరళ రాష్ర్టాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అక్కడి దీన పరిస్థితి చూసి దేశ విదేశాల నుంచి పలువురు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కాగా ఇటువంటి హృదయ విదారక పరిస్థితిని కూడా కొంతమంది తమ ప్రచార ఆర్భాటానికి ఉపయోగించుకున్నారు. విరాళాల రూపంలో సీఎం సహాయ నిధికి వచ్చిన రూ. 3.26 కోట్ల విలువైన చెక్కులను, డీడీలను బ్యాంకులు తిరస్కరించాయి. అసెంబ్లీ సమావేశాల్లో చర్చ సందర్భంగా కసర్గోడ్ ఎమ్మెల్యే ఎన్ నీలిక్కున్ను ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు. సీఎం సహాయ నిధికి 30 నవంబర్,2018 వరకు మొత్తం రూ. 2,797.67 కోట్ల సహాయం అందిందన్నారు. దీంట్లో రూ. 260.45 కోట్లు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ ద్వారా రాగా రూ. 2,537.22 కోట్లు చెక్కులు, నగదు, డీడీల రూపంలో వచ్చిందన్నారు. ఒక్క చెక్కుల ద్వారానే రూ. 7.46 కోట్లు వచ్చినట్లు తెలిపారు.