YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి దేశీయం

జూన్ 2 సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష

జూన్ 2 సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 2న నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ ఫిబ్రవరిలో విడుదల చేయనుంది. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్) విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కోటా ఆమోదం తర్వాత జరగనున్న మొదటి పరీక్షలు ఇవే కావడం విశేషం. యూపీఎస్సీ ప్రతి ఏడాది నిర్వహించే ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య లక్షల్లోనే ఉంటూ వస్తోంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలు రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష (ఆబ్జెక్టివ్- పేపర్ ఆధారిత), రెండో దశలో మెయిన్స్ (డిస్క్రిప్టివ్ పేపర్, ఇంటర్వ్యూ) పరీక్ష నిర్వహిస్తోంది. ప్రిలిమినరీ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూలోనూ ఉత్తీర్ణులైనవారికి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ప్రతి ఏడాది సివిల్ సర్వీసెస్ పరీక్షలకు దాదాపు 10 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు జనవరి 9న పార్లమెంట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రాజ్యసభలోనూ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జనవరి 13 ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ విద్యాసంవత్సరం ఆరంభం అంటే జూన్‌లో విద్యాసంస్థలు ప్రారంభమయ్యే సమయం నుంచే ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఐటీ, ఎన్‌ఐటీ, కేంద్రీయం విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలోనూ ఈ కొత్త రిజర్వేషన్ విధానాన్ని అమలుచేస్తారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ల విధానాన్ని అమలుచేయడం కారణంగా.. ఇతర వర్గాలకు చెందిన రిజర్వేషన్లపై ఎలాంటి ప్రభావం చూపదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇటీవల స్పష్టం చేసిన సంగతి విదితమే. సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్), రైల్వే ట్రాఫిక్‌/అకౌంట్స్‌ సర్వీస్‌, ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌ సహా దేశంలోని పలు సివిల్ సర్వీసెస్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీని చేపడతారు. ఇందుకోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలను ఏటా నిర్వహిస్తూ వస్తోంది. 

Related Posts