యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఎవరి షెడ్యూల్ వారిదే అయినా, ఒకేరోజు ఇద్దరు చంద్రులూ ఢిల్లీ పర్యటనకు వెళుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అమరావతిలో నిర్మించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనం ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌ని ఆహ్వానించేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళుతున్నారు. ఇదే సమయంలో వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతోనూ ఆయన సమావేశం కానున్నారు. అలాగే బుధవారం జరగనున్న బీజేపీయేతర పక్షాల భేటీలోనూ చంద్రబాబు పాల్గొంటారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రాజధాని పర్యటనకు వెళ్తున్నారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో నిర్వహిస్తోన్న సహస్ర చండీయాగంలో బిజీగా ఉన్నా సరే, ఢిల్లీలో జరిగే కేంద్రమంత్రి హర్షవర్ధన్ కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీయేతర పక్షాలు తమతమ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్న వేళ కేసీఆర్, చంద్రబాబులు ఢిల్లీలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో చంద్రబాబు, బీజేపీ నేతలతో కేసీఆర్ కలవనుండటం గమనార్హం. ఇక, జనవరి 19న కోల్‌కతాలో మమతా బెనర్జీ ఆధర్వంలోని విపక్షాలు నిర్వహించిన ర్యాలీ విజయవంతం కావడంతో బీజేపీయేతర పక్షాలు ఉత్సాహంతో ఉన్నాయి. అలాగే, అమరావతి వేదికగానూ మరో భారీ ర్యాలీని చేపట్టి, దీనికి బీజేపీయేతర పార్టీలను ఆహ్వానించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఢిల్లీ పర్యటనలో వివిధ పార్టీల నేతలో చర్చలు జరపనున్నారు.