యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది దక్షిణ బంగాళాఖాతాన్ని ఆనుకుని హిందూమహాసముద్రం మీదుగా ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఆగ్నేయ ప్రాంతంలో అండమాన్ వద్ద ఏర్పడిన ద్రోణి అల్పపీడనంగా మారినట్టు వివరించారు. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి ఈ అల్పపీడనం ఉందని వారు వివరించారు. దీని ప్రభావంతో జనవరి 25న ఆంధ్రప్రదేశ్‌లోని అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఆప్ఘనిస్థాన్ మీదుగా సాగుతోన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర భారత దేశంలో మంచు ప్రభావం అధికంగా ఉంది. దీని ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగినా రాత్రివేళలో మాత్రం కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. రాయలసీమలో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయింది. జనవరి 19న శనివారం ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, ఏపీలోని అత్యల్పంగా ఆరోగ్యవరంలో 13 డిగ్రీలు, అనంతపురం, తిరుపతి, నంద్యాల, విశాఖ, జంగమహేశ్వరపురంలలో 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్పపీడనం వల్ల తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలిపింది. రాష్ట్రంలో పగటిపూట పొడి వాతావరణం, రాత్రి వేళలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.