యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర వైద్య, మైనారిటీ శాఖా మంత్రి ఫారూక్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలో రూ 3.15 కోట్ల అంచనాతో పాత ప్రసూతి భవన ఆధునీకరణ పనులకు అయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. ఎన్ టిఆర్ వైద్య సేవ ద్వారా 1046 జబ్బులకు ఉచితంగా కార్పోరేట్ వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదన్నారు. కాన్పులకు అవసరమైతే సిజేరిన్ చేయడానికి ఎన్ టిఆర్ వైద్య సేవ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఆసుపత్రి ఆవరణలోని లెక్చర్ హాల్ లో మరమ్మత్తులకు 10 లక్షల మంజూరు చేస్తామని తెలిపారు. మిలీనియం బ్లాకు మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. మాతా, శిశు మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేయాలన్నారు.
ఎమ్మల్యే ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ కర్నాటక, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను అందిస్తున్నదని తెలిపారు. ఈ ఆసుపత్రి నానాటికి అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. రాష్ట్రం లోని ఆసుపత్రిల్లోకి కర్నూలు సర్వజన ఆసుపత్రిలో ఓపి కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, ఇందుకు డాక్టర్లను అభినందిస్తున్నామన్నారు. అంతకు ముందు ప్రతి రోజు ఆసుపత్రికి వచ్చే వారి ఉపయోగార్ధం ఉచితంగా అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని శాంతి ఆశ్రమం ట్రస్ట్ పూజ్య హిమాలయ గురు దేవు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కెడిసిసి బ్యాంక్ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి, గొర్రెల పెంపకం దార్ల సహకార సంఘం అధ్యక్షులు నాగేశ్వర యాదవ్, ఆసుపత్రి సూపరిడెంటెంట్ డా.చంద్రశేఖర్, మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డా. రాం ప్రసాద్, డాక్టర్లు పారా మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.