YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

మిరప రైతుకు మద్దతేది?

 మిరప రైతుకు మద్దతేది?

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

వర్షాభావం వల్ల ఆంధ్రప్రదేశ్ లో పంట దిగుబడులు క్షీణించాయి. అంచనాలకు తగ్గట్లుగా ఉత్పత్తి లేదన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెగుళ్ల ఎఫెక్ట్ కూడా చాలా దుష్ప్రభావం చూపింది. మొత్తంగా రైతుల కష్టానికి, వారు వెచ్చించిన పెట్టుబడికి తగిన ఫలితం లేదన్న కామెంట్స్ గుంటూరు జిల్లాలో వినిపిస్తున్నాయి. నీటి కొరత, చీడపీడల  వల్ల ప్రధానంగా మిరప పంట తీవ్రంగా ప్రభావితమైనట్లు పలువురు అంటున్నారు. మిరపరైతులు ఈ దఫా నష్టాలు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. పెద్దమొత్తంలోనే పెట్టుబడి పెట్టి తక్కువ దిగుబడి రావడంతో రైతుల్లో ఆవేదన వెల్లువెత్తుతోంది. చేతికందిన కొద్ది పంటకూ సరైన మద్దతు ధర లేకపోవటంతో వారిలో ఆందోళన నెలకొంది. కొందరు ధర కోసం నిరీక్షిస్తుండగా మరికొందరు అప్పులకు వడ్డీలు భరించలేక ఉన్న ధరకే ప్రైవేట్ వ్యాపారులకు పంటను విక్రయించుకుంటున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో రైతులు మిరప పంటను సాగు చేశారు. అయితే ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల వల్ల సాగు సజావుగా సాగలేదు. వర్షపాతం తగినంతగా లేకపోవడంతో పాటూ చీడపీడలతో రైతులు సమస్యలు ఎదుర్కొన్నారు. పంటను కాపాడుకునేందుకు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేసినా  పైరు ఎదుగుదల సరిగాలేకుండాపోయింది. ఫలితంగా దిగుబడులు తగ్గిపోయాయి. పెట్టుబడి ఖర్చుల కోసం పలువురు రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేశారు. ఇప్పుడు అప్పు తీర్చలేని పరిస్థితి నెలకొందని కొందరు రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మిరప పంట సాగు ఖర్చతో కూడుకున్నప్పటికి లాభాలు కూడా అధికంగా ఉంటుండటంతో ఎక్కువ మంది రైతులు ఎకరాకు రూ.15 వేలు నుండి రూ.20 వేలు వరకు ముంద స్తుగా కౌలు చెల్లించి పంట సాగు చేశారు.అయితే దిగుబడి పూర్తిగా పడిపోవటంతో నష్టపోయారు.కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని మరికొందరు రైతులు వాపోతున్నారు.
మిరప సాగుకు ఎకరాకు రూ.లక్ష వరకూ ఖర్చు చేసిన రైతులు ఉన్నారు.  సాగు ప్రారంభం నుంచే వర్షాలు సరిగా కురవలేదు. అంచనాల ప్రకారం వర్షపాతం నమోదుకాలేదు. ఇదిచాలదన్నట్లు పంటలను తెగుళ్లు ఆశించాయి. చీడపీడల నివారణకు రైతులు పురుగుమందుల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. పైర్లకు బొబ్బర తెగులు, వేరుకుళ్ళు తెగులు ఆశించడంతో తీవ్ర ప్రభావం చూపింది. మొక్క ఎదుగుదల నిలిచిపోయింది. మొక్క పెరుగుదల తగ్గడంతో దిగుబడి కూడా క్షీణించింది. పెట్టుబడులు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పైరును రక్షించుకుంటున్నా సకాలంలో నీరు అందక రైతులు మరింత ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. పంటలను రక్షించుకునేందుకు నీటి అవసరాలకు రూ.10 వేలు ఖర్చు చేసి నీటిని పొందుతున్నారు. ఇంత కష్టపడినా దిగుబడి మాత్రం ఆశించిన స్థాయిలో దక్కడంలేదు. ఇదిలాఉంటే దిగుబడులు ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్లలోపే వచ్చే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. పెట్టుబడి కూడా చేతికి అందే పరిస్థితి లేకపోగా అప్పులే మిగులుతున్నాయని వాపోతున్నారు. ప్రస్తుతం పంట చేతికందే సమయంలో నాణ్యమైన మిరపకు క్వింటాకు రూ.8 వేలు నుండి రూ.10 వేలు వరకు మాత్రమే ధర ఉంది. నాణ్యత లేని మిరపను రూ.5 వేలు నుండి రూ.7 వేల వరకు కోనుగోలు చేస్తున్నారు. ఈ రేటు గిట్టుబాటు కాదని రైతులు చెప్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకునేందుకు ముందుకురావాలని, సరైన మద్దతు ధర ప్రకటించి అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

Related Posts