యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
వేసవికాలం ప్రారంభం కావడానికి మరో రెండు నెలలు టైమ్ ఉంది. అయితే అంతకు ముందే అంటే శీతాకాలంలోనే కర్నూలు జిల్లా పల్లెల్లో తాగునీటి సమస్యలు ప్రారంభమైనట్లు వార్తలొస్తున్నాయి. స్థానికంగా భూగర్భజలాలు తగ్గిపోవడమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. ఈ ఎఫెక్ట్ వల్లే జిల్లాలో నీటి ఎద్దడి పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. ఇప్పటికే పశ్చిమ ప్రాంత గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య మరింత తీవ్రం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ ఇబ్బందిపై దృష్టి సారించింది. సమస్య తీవ్రం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం ఈ విషయమై ఉదాసీనంగా ఉంటున్నారని నీటి సమస్యను పరిష్కరించే చర్యలు ముమ్మరం చేయడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వాస్తవానికి జిల్లాలో పిడబ్లూసీ పథకాలు 1969 ఉన్నాయి. వీటిలో కొన్ని పని చేయడం లేదు. మొత్తం చేతి పంపులు 12,402 ఉండగా వీటిలో 1700లకు పైగా పంపులు వినియోగంలో లేవు. జిల్లాలో తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు సర్కార్ ఏటా నిధులు అందిస్తోంది. అయితే నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. నిధులు ఖర్చు సరిగా లేకపోవడంతో ఏటా జనవరి లోనే పలు గ్రామాల్లో తాగునీటికి సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
వేసవి రాకుండానే ఏడాది ప్రారంభం నుంచే జిల్లావాసులు తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక మనిషికి రోజుకు 135 లీటర్ల నీటిని అందించాల్సి ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లోని వారికి కేవలం 20 నుంచి 30 లీటర్లకు మించి నీరు అందని పరిస్థితి. మరికొన్ని గ్రామాల్లో నాలుగు రోజులకు ఒకసారి నీరు వదులుతున్న పరిస్థితి ఉంది. జిల్లాలోని పట్టణ గ్రామీణ ప్రాంతాల తేడా లేకుండా చాలాచోట్ల ఈ దుస్థితి నెలకొంది. పలు ప్రాంతాల్లో 20 నుంచి 10 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోవడం తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో తాగునీటి చిక్కులు తొలగించేందుకు ఇప్పటి నుంచే చర్యలు ముమ్మరం చేయాలని అంతా కోరుతున్నారు. ఇదిలాఉంటే చెడిపోయిన బోర్లకు మరమ్మతులు చేయించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ కూడా చేశారు. జిల్లాలో నీటి సమస్య అత్యంత తీవ్రంగా ఉన్న ప్రాంతాలు సుమారు 343 ఉండొచ్చని అంచనా. ఇదిలాఉంటే ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉంది. దీంతో నీటి ఎద్దడి ఉన్న గ్రామాలు మరిన్ని పెరిగే అవకాశం ఉంది. దీని తగ్గట్లుగా అధికారులు తాగునీటిని సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని ఊళ్లకు పంపాలని అనుకుంటున్నారు. నీటి సమస్య నివారణకు చేపట్టబోయే పనులు, మరమ్మతులకు ఎంతమేర ఖర్చవుతుందో అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. ఈ పనులకు రూ. 9 కోట్లకుపైగా నిధులు అవసరమవుతాయని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే సంబంధిత పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని నిర్ణయించారు. ఏదేమైనా తాగునీటి సమస్య ఉధృతంకాకుండానే తగిన చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.