యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఎన్నికల కారణంగా తెలంగాణలోని ప్రభుత్వ జానియర్ కాలేజీలకు అనేక సెలవులు వచ్చాయి. గతేడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకూ ఉన్న పరిస్థితిని గమనిస్తే 51 రోజులు సెలవులుగా తేలాయి. ఫలితంగా క్లాసులు సరిగా సాగలేదు. ఇక అధ్యాపకులు కొందరు ఎన్నికల విధుల్లో పాల్గొనడంతో పాఠ్యాంశాలు పూర్తికాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పరీక్షలు మొదలవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో తెలీడంలేదని పలువురు విద్యార్ధులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. లెక్చరర్లు ప్రభుత్వ కాలేజీల్లో ప్రాక్టికల్స్ నిర్వహించటం, సిలబస్‌లు పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి, రెండో, మూడో విడత విధులకు అధ్యాపకులందరినీ నియమించారు. దీంతో జనవరి మొత్తం వారు కళాశాలలకు దూరమవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి జరగాల్సిన ప్రయోగ పరీక్షల్లో విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడవచ్చని విద్యార్ధిసంఘాల నేతలు కూడా అంటున్నారు. ఇక 27 నుంచి జరగాల్సిన థియరీ పరీక్షలకు వారిని సన్నద్ధం చేయడమూ కష్టంతో కూడుకున్న వ్యవహారమే అని వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైతేనేం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్ధులకు కొన్ని ఇబ్బందులనే సృష్టించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 32 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిలో పదివేల మందికిపైగా విద్యార్ధులు చదువుకుంటున్నారు. జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ అధ్యాపకుల సంఖ్య తక్కువగా ఉంది. కాంట్రాక్ట్ లెక్చరర్లతోనే పలు కళాశాలల్లో బోధన సాగిస్తున్నారు. మరికొన్నిచోట్ల గెస్ట్ లెక్చర్లతో క్లాసులు చెప్పించారు. అధ్యాపకుల కొరతతో నత్తనడకన సాగిన సిలబస్.. ఎన్నికల కారణంగా ఇంకొంత ఆలస్యమైంది. పరీక్షలు దగ్గరపడినా సిలబస్ పూర్తికాకపోవడంతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. ఇటు అధ్యాపకులు, ప్రిన్సిపాల్స్ కూడా టెన్షన్ పడుతున్నారు. ఇంటర్ లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని అధ్యాపకులు భావించారు. అయితే వివిధ కారణాల వల్ల సిలబసే పూర్తికాని పరిస్థితి. దీంతో విద్యార్ధులను పరీక్షలకు రెడీ చేయడం వారికి కత్తిమీద సాములా మారిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.