యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన సీనియర్ ఆయన ఒకవైపు! పోల్ మేనేజ్‌మెంట్, ఎన్నికల వ్యూహ రచనలో ఆరితేరిన నేత మరోవైపు!! కొడుకును ఎలాగైనా ఎమ్మెల్యే చేయాలనే కోరిక ఒకవైపు! ఈసారీ తానే ఎమ్మెల్యేగా గెలవాలనే పట్టుదల మరోవైపు!! ఆర్థికంగా అంతకంతకూ బలపడిన వ్యక్తి ఒకవైపు! రాజకీయంగానూ, ఆర్థికంగా ప్రత్యర్థికి ఏమాత్రం తీసిపోని నేత మరోవైపు!! ప్రస్తుతం కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఎన్నడూ లేనంత పోటీ మైలవరం నియోజకవర్గంలో నెలకొంది. కొడుకు కృష్ణప్రసాద్(కేపీ)ని ఎలాగైనా సరే ఎమ్మెల్యే చేయాలని భీషణ ప్రతిజ్ఞ చేసి అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు వసంత నాగేశ్వరరావు. ఇక మంత్రిగా అంతకంతకూ బలం, బలగాన్ని రెట్టింపు చేసుకుని ఈసారీ కూడా తానే గెలుస్తాననే ధీమాతో ఉన్నారు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ప్రస్తుతం కృష్ణ ప్రసాద్ వర్సెస్ దేవినేని ఉమ మధ్య వార్.. తారాస్థాయికి చేరింది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. నేతలు పందెం కోళ్లలా సై అంటే సై అంటున్నారు. ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాల్లో బిజీబిజీగా ఉంటున్నారు. సామాజిక సమీకరణాల లెక్కలు వేసుకుని పావులు కదుపుతున్నారు. రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యం గల కృష్ణా జిల్లాలో హీట్ మరింత పెరిగింది. మైలవరం రాజకీయం ఎలా ఉండబోతోందనే చర్చ జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదం, సమితి నుంచి హోంమంత్రిగా ఎదిగిన రాజకీయ ప్రస్థానం గల వసంత నాగేశ్వరరావు. ఎన్టీఆర్ హయాంలో తిరుగులేని నేతగా.. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అలంకరించిన ఆయనకు.. తనయుడు కృష్ణప్రసాద్‌ను ఎమ్మెల్యేగా చేయాలనే కోరిక మాత్రం నెరవేరడం లేదు. సైకిల్ దిగి హస్తం పట్టుకుని మళ్లీ సైకిలెక్కినా ప్రయోజనం లేకుండా పోయింది.ప్రస్తుతం కృష్ణ ప్రసాద్ మైలవరం నుంచి బరిలోకి దిగబోతున్నారు. అయితే ఇక్కడ ఏళ్లుగా ఆధిపత్యం కొనసాగిస్తున్న దేవినేని కుటుంబంపై ఒక్కసారైనా నెగ్గాలనే కోరిక దాదాపు పాతికేళ్లుగా నాగేశ్వరరావుకు ఉంది. తండ్రీతనయులిద్దరూ పోటీచేసినా ఓటమి చవిచూశారు. ప్రస్తుతం నాగేశ్వరరావు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈ సారి కేపీను మైలవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. ప్రస్తుతం ఇక్కడి నుంచిటీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరావు వ్యవహరిస్తున్నారు. పోల్ మేనేజ్‌మెంట్, ఎన్నికల వ్యూహరచనలో ఆయనకంటూ గుర్తింపు ఉంది. గతంలో కేపీ ఉమాపై 1999లో పోటీ చేసి ఓడిపోయారు. నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న దేవినేని ఉమాను ఓడించేందుకు కేపీ ఈ దఫా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ముందుగా రియల్ రంగంలో ఆర్ధికంగా నిలదొక్కుకుని ఇప్పుడు ఉమాను ఢీ కొట్టే స్థాయికి ఎదిగారు.రాజకీయ అనుభవంతో పాటు టీడీపీ సర్కారుపై ప్రజా వ్యతిరేకత కూడా తమకు అనుకూలిస్తుందని తండ్రీ కొడుకులు లెక్కలు వేసుకుంటున్నారు. మైలవరంలో కేపీ వైసీపీ కార్యాలయాన్ని స్థాపించటమే గాక టీడీపీ వ్యతిరేక వర్గాలను ఏకం చేసే పనిలో పడ్డారు. అక్కడ సీటు ఆశిస్తూ పెడన నియోజకవర్గానికి వెళ్లిన జోగి రమేష్‌ను కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కార్యక్రమాలను చేపడతున్నారు. పండగలు, వేడుకలు ఏది జరిగినా క్షణాల్లో అక్కడ వాలిపోతున్నారు. ఇటీవల జగన్ పుట్టినరోజు సందర్భంగా కృష్ణాజిల్లాలో ఎక్కడా లేని విధంగా 5 వేల బైకులతో ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేశారు. కేపీ లాంటి బలమైన ప్రత్యర్థి రంగంలో ఉండడంతో ఉమ చెమటలు కక్కుతూ గతంలో ఎప్పుడూ లేనంతగా నియోజకవర్గానికే ఎక్కువుగా టైం కేటాయిస్తున్నారు. దీంతో 2019లో హోరా హోరీ తప్పదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.