యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అన్నదాతల నుంచి అటో డ్రైవర్ల వరకు... చేనేత కార్మికుల నుంచి అగ్రిగోల్డ్ బాధితుల వరకు... అనేక వర్గాలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లను రెట్టింపు చేయాన్న నిర్ణయానికి రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీనిద్వారా 54.61 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది. డీఏ బకాయిల మొత్తం రూ.513 కోట్లను ఉద్యోగులకు వాయిదాల రూపంలో చెల్లించాలని, దీనిపై ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రివైజ్డ్ పే స్కేలు-2015 ప్రకారం మినిమం టైమ్ స్కేల్ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. దీనిప్రకారం వారి వేతనం దాదాపు 50 శాతం పెరుగుతుంది. గతంలో వారికి ఏటా 10 నెలల జీతం మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు పది రోజులు మాత్రం మినహాయించి... మొత్తం 12 నెలలకు జీతం ఇస్తారు. ఆటోలు, ట్రాక్టర్లకు కేటగిరీలను బట్టి త్రైమాసిక, జీవిత కాల పన్ను మినహాయించారు. దీని వల్ల 9 లక్షల మంది ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్లు 1.82 లక్షల మంది ట్రాక్టర్ యజమానులకు లబ్ధి చేకూరనుంది.చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా.. చేనేత కార్మికులకు వైద్య- ఆరోగ్య బీమ పథకాన్ని ప్రభుత్వం మళ్లీ తీసుకొస్తోంది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో దీనిని చేపడుతున్నారు. అలాగే... బుడగ జంగాల సామాజిక హోదా మార్పుపై శర్మ కమిటీ నివేదికపై మంత్రి మండలి చర్చించింది. రాబోయే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది. రైతుకు సాయం... రాష్ట్రంలో రైతులకు మరింత మేలు చేసేలా పెట్టుబడి సాయం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. రైతులతోపాటు కౌలు రైతులకూ ప్రయోజనం చేకూర్చే ఈ పథకాన్ని వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేస్తారు. దీనికి సంబంధించిన తుది విధి విధానాలను త్వరలోనే ఖరారు చేస్తారు. అగ్రి గోల్డ్ బాధితులకు అండ.. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. చిన్న డిపాజిట్లను తానే చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకు రూ.250 కోట్ల మొత్తాన్ని హైకోర్టులో డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ మొత్తాన్ని చిన్న డిపాజిట్‌దారులకు అందచేస్తారు. అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకంతో వచ్చిన మొత్తాన్ని కూడా దీనికి జతచేస్తూ బాధితులకు చెల్లింపులు చేస్తారు.2014 జూన్ నుంచి మంజూరు కాకుండానే నిర్మించుకున్న 1.26 లక్షల ఇళ్లకు సాయం అందించనున్నారు. ఒక్కో ఇంటికి రూ. 60 వేలు చొప్పున ఇస్తారు. అందులో మరుగుదొడ్డికి రూ.15వేలు కేటాయిస్తారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.756 కోట్లు భారం పడనుంది. అలాగే... 1996-2004 మధ్యలో పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్ల మరమ్మతుల కోసం ఒక్కో ఇంటికి రూ. 10 వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 20వేల యూనిట్లకు రూ.20 కోట్లు చెల్లిస్తారు. అలాగే... అర్బన్ హౌసింగ్ కోసం భీమునిపట్నం మండలం కొత్త వలసలో 94.86 ఎకరాలు,పెందుర్తి మండలం సౌభాగ్యరాయపురంలో 127.46 ఎకరాలను ల్యాండ్‌పూలింగ్‌లో సమీకరించేందుకు అనుమతించారు.