YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జైలు నుంచే చక్రం తిప్పుతున్న చిన్నమ్మ

 జైలు నుంచే చక్రం తిప్పుతున్న చిన్నమ్మ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

అన్నాడీఎంకేను తిరిగి హస్తగతం చేసుకోవాలని జయలలిత నెచ్చెలి శశికళ జైలు నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికలు, ఉప ఎన్నికలను ఆమె టార్గెట్ గా చేసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో లోక్ సభ ఎన్నికలతో పాటు 22 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శశికళ స్పీడ్ ను పెంచారని తెలుస్తోంది. ఇప్పటికే శశికళ తన మేనల్లుడు దినకరన్ తో పలు దఫాలుగా చర్చించారని చెబుతున్నారు. ఎలాగైనా ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే ను దెబ్బకొట్టి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ను గట్టిగా దెబ్బతీయాలని, తద్వారా పార్టీ తిరిగి తమ కుటుంబం చేతుల్లోకి వస్తుందని ఆమె అంచనా వేస్తున్నారు.జైలు పాలవ్వడానికి కారణమైన బీజేపీ తో కాకుండా ఆమె కాంగ్రెస్ తో చేతులు కలిపే అవకాశముంది. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతితో జరిపిన చర్చల సారాంశమూ ఇదేనంటున్నారు. జయలలిత మరణం తర్వాత అక్రమాస్తుల కేసును బయటకు తీసి తనను జైలులో పెట్టారని బీజేపీ నాయకత్వంపై శశికళ కుతకుతలాడిపోతున్నారు. తాను నమ్మి ముఖ్యమంత్రిని చేసిన పళనిస్వామి సయితం బీజేపీ పంచన చేరడానని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇప్పటికే తన మేనల్లుడు దినకరన్ ద్వారా అమ్మ మక్కల్ మున్నేట్ర కజగమ్ పార్టీని పెట్టించిన సంగతి తెలిసిందే. శశికళ స్పీడ్ పెంచడంతో ఇటీవల అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు స్వరం పెంచుతున్నారన్న టాక్ కూడా వినపడుతోంది.లోక్ సభ ఎన్నికలతో పాటు, 22 అసెంబ్లీ స్థానాల్లో అన్నాడీఎంకే ను చావుదెబ్బ తీయడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పళనిస్వామి, పన్నీర్ సెల్వంలను క్లియర్ చేయాలన్న ఉద్దేశ్యంతో శశికళ ఉన్నారు. ఇందుకు అవసరమైతే డీఎంకే కూటమిలో కూడా చేరాలని దినకరన్ కు శశికళ దిశానిర్దేశం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తన సోదరుడు ఆళగిరి తనపై ధ్వజమెత్తుతుండటంతో దినకరన్ పార్టీ సహకారం అవసరమని కూడా స్టాలిన్ భావిస్తున్నారని చెబుతున్నారు. ఆర్ కె నగర్ లో సత్తా చాటిన దినకరన్ ఆర్థికంగా, సామాజిక పరంగా అండగా ఉంటే విజయం తథ్యమన్నది స్టాలిన్ ఆలోచన కూడా. అందుకే దినకరన్ వైపు నుంచి ప్రతిపాదన వస్తే చేర్చుకోవడానికి సిద్ధంగాఉన్నారట స్టాలిన్.పార్టీ శ్రేణులు కూడా పళనిస్వామి, పన్నీర్ సెల్వం నాయకత్వంపై విశ్వాసం కన్పించడం లేదు. ఇద్దరూ చరిష్మా కలిగిన నేతలు కాకపోవడంతో అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో కూడా వీరి నాయకత్వంలో అన్నాడీఎంకే గట్టెక్కడం కష్టమేనన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే కూటమి మెజారిటీ స్థానాలను సాధిస్తుందని వివిధ సర్వేలు కూడా తేల్చి చెబుతుండటంతో ఇదే తనకు అవకాశమని శశికళ భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు జైలులో ఉన్న శశికళను కలిశారని చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకేను దెబ్బ తీసి పళనిస్వామిని కూడా గద్దె దించాలన్న వ్యూహంలో శశికళ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts