YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇస్తారా... ఇవ్వరా... పొలిటికల్ లీడర్స్ కొత్త ట్రెండ్...

ఇస్తారా... ఇవ్వరా... పొలిటికల్ లీడర్స్ కొత్త ట్రెండ్...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

సీటు ఖాయం చేస్తారా? గోడ దూకేయమంటారా? ఈ వారంలో తేల్చి చెప్పాల్సిందే. ప్రధానపార్టీలకు బలమైన అభ్యర్థులు విసురుతున్న సవాల్ ఇది. ఆరునెలల ముందుగానే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామంటూ హడావిడి చేసిన చంద్రబాబు నాయుడు గప్ చుప్ గా ఉన్నారు. ఇంతవరకూ నియోజకవర్గ ఇన్ ఛార్జులుగా ఉన్నవారిని మారుస్తూ గందరగోళం సృష్టిస్తున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇంకా స్పష్టతకు రాలేదు. మరో నెలరోజుల్లో ఎన్నికల షెడ్యూలు రాబోతోంది. మూడు నెలలలోపు ఎన్నికల తంతు ముగియబోతోంది. అయినప్పటికీ ప్రధానపార్టీలు అభ్యర్థులకు క్లియరెన్సు ఇవ్వలేకపోతున్నాయి. ప్రత్యర్థులు ఎవరిని బరిలో దింపుతారోననే అనుమానంతో విషయాన్ని సాగదీస్తున్నారు. పోటాపోటీ వాతావరణం నెలకొని ఉన్న స్థితిలో ప్రత్యర్థి తేలకుండా ఎవరో ఒకరికి టిక్కెట్టు ఇచ్చేస్తే మునిగిపోతామనే భావనలో ఉన్నాయి పార్టీలు. ఫలితంగా అభ్యర్థుల్లో అసహనం నెలకొంటోంది. ఎదురుచూపులు ఎన్నాళ్లో తెలియనిస్థితి. అందుకే జంప్ జిలానీల సంఖ్య పెరిగిపోతోంది. అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకూ ప్రధాన పార్టీలు తిరుగుబాట్లను చవిచూస్తున్నాయి. పొటెన్షియల్ క్యాండిడేట్లుగా భావిస్తున్న వారు పక్కచూపులు చూస్తున్నారు.అగ్రవర్ణాల్లోని పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దాంట్లో అయిదు శాతం కాపులకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ నిర్ణయించింది. గతంలో బీసీల్లో చేరుస్తామని తాము ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేని స్థితిలో ఇదే ప్రత్యామ్నాయంగా టీడీపీ అధినేత భావించారు. దీనివల్ల కాపు కార్డు తమకు అనుకూలంగా ఎన్నికల్లో పనిచేస్తుందనే అంచనా వేస్తున్నారు. అయితే మిగిలిన అగ్రవర్ణాల రిజర్వేషన్లు దీనివల్ల కుదించుకుపోయే ప్రమాదం ఉంది. రెడ్డి,కమ్మ,బ్రాహ్మణ,వైశ్య,క్షత్రియ వంటి అగ్రవర్ణాలన్నిటికీ కలిపి అయిదుశాతం రిజర్వేషన్, కాపులకు అయిదు శాతం అన్నట్లుగా విభజన చేయాలని రాష్ట్రం యోచన. అయితే మిగిలిన పెద్దకులాలన్నీ వ్యతిరేకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జనసంఖ్య రీత్యా కాపులు ఎక్కువగానే ఉన్నారు. అయినా సంఘటితంగా ఓట్లన్నీ తెలుగుదేశానికి పడతాయని చెప్పలేం. బరిలో జనసేనాని ఉండటమూ టీడీపీకి విఘాతమే. మరోవైపు మిగిలిన అగ్రవర్ణాలు కచ్చితంగా వ్యతిరేకంగా ఓటు వేసే చాన్సులున్నాయి. అగ్రవర్ణ రిజర్వేషన్లలో మళ్లీ విభజన చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను చెప్పుకోవాలి. పర్యవసానాలను పట్టించుకోకుండా రాజకీయమైలేజీని దృష్టిలో పెట్టుకుని తక్షణం ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 40 స్థానాల్లో దీని ప్రభావం ఉంటుందనేది టీడీపీ అంచనా.మూడు నెలల్లో దాదాపు 20 నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జులను మార్పు చేశారు జగన్ మోహన్ రెడ్డి. నాలుగేళ్ల నుంచి పార్టీని పోషిస్తూ వచ్చిన తమను దూరం పెట్టడం భావ్యం కాదని వారు వాపోతున్నారు. అధికారపార్టీని ఎదుర్కోవడంలో అనేక కష్టనష్టాలు చవిచూశామంటున్నారు. పైపెచ్చు పార్టీ కార్యకలాపాలు, ఆందోళనలు నిర్వహించడానికి కోట్ల రూపాయలు వెచ్చించామని చెబుతున్నారు. తమ చేతులు ఖాళీ చేసుకున్న తర్వాత పార్టీ మొండి చేయి చూపుతోందని ఆరోపిస్తున్నారు. ఇంతవరకూ పార్టీకి అనుసంధానంగా ఉండటంతో క్యాడర్ లో వారికి కొంతమేరకు పట్టు ఉంది. ఇన్ఛార్జులను మార్చిన నియోజకవర్గాల్లో తిరుగుబాటుల బెడద ఎక్కువగా కనిపిస్తోంది. పార్టీ వ్యతిరేకప్రచారానికి అంతర్గత అసంత్రుప్తి ప్రధానకారణమవుతోంది. దీనిని సర్దుబాటు చేసుకోకుండా ఎన్నికలకు వెళితే 12 నియోజకవర్గాల్లో పరిస్థితులు ప్రతికూలమవుతాయని పార్టీలోనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈవిషయంలో తెలుగుదేశం పార్టీ కొంత సురక్షితంగానే ఉంది. అయితే రాయలసీమ జిల్లాల్లో పార్టీ ఇంకా పట్టు సాధించలేకపోతోంది. కొందరు ఎమ్మెల్యేలు సైతం ఎన్నికల ఘడియల్లో వైసీపీ వైపు జంప్ కావచ్చని రాజకీయ రూమర్లు మొదలయ్యాయి.ప్రజల్లో ఉండే పరపతి, పలుకుబడి ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇప్పుడు ప్రధాన అర్హతలు కావు. క్యాష్ ఎంత ఉందనేది ముఖ్య వనరుగా చూస్తున్నారు. ప్రధానపార్టీలు రెండూ ఇదే ధోరణిని అనుసరిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. వనరులు సమకూర్చుకుని తమకు చూపించాలని వైసీపీ నాయకులు షరతులు విధిస్తున్నారు. ఇందుకు ఫిబ్రవరి పదో తేదీ డెడ్ లైన్ గా పెట్టినట్లుగా ప్రచారం. ఆస్తులు ఉండటం, స్నేహితులు సర్దుబాటు చేస్తారనే సాకులను అధిష్ఠానం ఆలకించడం లేదు. కచ్చితంగా నిధులు చూపించాల్సిందేనంటున్నారు. తెలుగుదేశం పార్టీ నిధులను కుమ్మరిస్తుందనే అనుమానాలే ఇందుకు ప్రధానకారణం. డబ్బులు లేక చివరలో అభ్యర్థులు చేతులెత్తేస్తే గెలుపు ముంగిట్లో బోర్లా పడాల్సి వస్తుందనేది ప్రతిపక్షం భయం. దాంతో ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తెలుగుదేశం కూడా అభ్యర్థుల ఆర్థిక స్తోమతను అంచనా వేస్తోంది. మెటీరియల్, ప్రచారానికి సంబంధించిన నిధులను పార్టీ సమకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయినప్పటికీ డబ్బుల పంపిణీకి సంబంధించి అభ్యర్థులే ఏర్పాట్లు చేసుకోవాలని అన్యాపదేశంగా చెబుతున్నట్లుగా సమాచారం. మొత్తమ్మీద అధికార, విపక్షాలను మనీ మేనియా వెన్నాడుతోంది.

Related Posts