యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:
*సుందర కాండ*
సుందరకాండ రామాయణంలో ఐదవ కాండ. హనుమంతుడు లంకా లంఘనానికి మహేంద్రగిరి మీదకు చేరుకోవడంతో కిష్కింధకాండ ముగుస్తుంది. సుందరకాండను “పారాయణ కాండ” అని కూడా అంటారు. సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునికి తెలియజెప్పుట ఇందులో ముఖ్యాంశాలు.
*సుందరకాండ పేరు:*
వాల్మీకి మహర్షి అన్ని కాండలకు ఆయా కథాభాగానికి సంబధించిన పేర్లు పెట్టాడు. కాని సుందరకాండకు “సుందరకాండ” అని పేరు పెట్టడానికి గల కారణాలను పండితులు చాలా రకాలైన వివరణలు, వ్యాఖ్యానాలు చెప్పారు. ప్రాచుర్యంలో ఉన్న సంస్కృత శ్లోకం దీనికి వివరణ ఇస్తుంది.
సుందరే సుందరో రామ:
సుందరే సుందరీ కథ:
సుందరే సుందరీ సీత
సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం
సుందరే సుందరం కపి:
సుందరే సుందరం మంత్రం
సుందరే కిం న సుందరం?
సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథ ను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన సీత కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ. సుందరమైన అంత్యాను ప్రాసలతో ఉపమాలంకార శబ్ధాలతో చెప్పబడినది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ. పారాయణకు సంబంధించిన అన్ని రకములైన సుందర విషయాలు చెబుతున్నది కావున సుందరకాండ. ఈ సుందరకాండ లో సుందరం కానిది ఏది?
అన్ని కాండలలో రాముడు ప్రత్యక్షంగా కనిపించి కథానాయకుడుగా ఉంటాడు. కాని సుందరకాండలో హనుమంతుని చేత శ్రీరాముని నామం ముమ్మార్లు స్మరించబడుతుంది. శ్రీరామ పాత్ర ప్రత్యక్షంగా కనిపించక పోయినా, నామం మాత్రం ఉపాసన చేయబడుతుంది లేదా జపింపబడుతుంది.
మరొక అభిప్రాయం: “హనుమంతుడు” (వజ్రాయుధం వల్ల హనుమ, అనగా దవడ, కు దెబ్బ తగిలినవాడు), ఆంజనేయుడు (అంజనా దేవి కుమారుడు), మారుతి (వాయుదేవుని కొడుకు) వంటి పేర్లు హనుమంతుని జీవితంలో ఘటనలు లేదా సంబంధాల కారణంగా వచ్చాయి. అసలు హనుమంతుని పేరు “సుందరుడు” అని, ఆ కారణంగా వాల్మీకి ఈ కాండకు “సుందరకాండ” అని పేరు పెట్టాడని అంటారు.
షోడశి రచనలోనే గుంటూరు శేషేంద్రశర్మ,”శ్రీ సుందరకాండకు ఆ పేరెట్లు వచ్చినది?” అనే అధ్యాయంలో రచయిత చెప్పిన కారణం – సుందరకాండ వాల్మీకి రామాయణానికి హృదయం. మంత్రయుక్తమైన రామాయణ కావ్యంలో, విశేషించి సుందరకాండలో, హనుమ యొక్క కుండలినీ యోగసాధన, త్రిజటా స్వప్నంలో గాయత్రీ మంత్రం నిక్షేపింపబడినవి. ఇది రామాయణమునకంతటికీ బీజ కాండము. ఇందులో సీతయే పరాశక్తి అని వాల్మీకి వాడిన అనేక శబ్దాల వలన, పదాల వలన గ్రహించవచ్చును. అట్టి అమ్మవారే సౌందర్యనిధి. ఆమెయే సౌందర్యము. శ్రీ దీప్తి హ్రీ శాంత్యాది శబ్దముల అర్ధము నందు వసించును. కనుక ఇది సుందరకాండము. ఆది శంకరుని ప్రసిద్ధ మంత్రయుక్త స్తోత్రము సౌందర్య లహరిలోని “సౌందర్య” పదము ఈ భావములోనే వాడబడినది. బ్రహ్మాండ పురాణములో ఈ కాండము “సౌందర్య కాండము” అనియే చెప్పబడినది.
*సుందరకాండ సంక్షిప్త కధ:*
కిష్కింధ కాండ చివరిలో సీతాన్వేషణానికై దక్షిణదిశకు బయలుదేరిన బృందం ఎలాగో సాగర తీరానికి చేరుకొంటారు. నూరు యోజనాల అవతల రావణుని నగరం లంకలో సీత ఉండవచ్చునని సంపాతి ద్వారా తెలుసుకొంటారు. కాని సాగర తరణం సాధ్యమయ్యేది ఎలాగని హతాశులౌతారు. జాంబవంతుని ప్రేరణతో సాగరాన్ని తాను గోష్పాదం లాగా లంఘించగలనని హనుమంతుడు సన్నద్ధుడౌతాడు. అక్కడినుండి సుందరకాండ కథ మొదలౌతుంది.
*హనుమంతుని సాగర తరణం:*
హనుమంతుడు పర్వత సమానంగా దేహాన్ని పెంచి, సాగరాన్ని దాటడానికి సన్నద్ధుడై మహేంద్రగిరిపైకి ఎక్కాడు. సూర్యునికి, ఇంద్రునికి, బ్రహ్మకు, భూతకోటికి నమస్కరించాడు. పిక్కలు బిగబట్టి, చేతులు అదిమి, ఒక్కుదుటున లంఘించాడు. అ అదురుకు పర్వతం బీటలు వారింది. ఆకాశంలో మేఘంలా, విడచిన రామబాణంలా, హనుమంతుడు వేగంగా లంకవైపుకు వెళ్ళసాగాడు. రామ కార్యానికి సహాయపడదలచి, దారిలో మైనాకుడనే పర్వతం తనపై విశ్రాంతి తీసికోమని కోరాడు. ఆ ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరిం చాడు హనుమంతుడు.