తూర్పుగోదావరి: జిల్లాలో మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వీరికి ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం జిల్లాలోని ముఖ్య ఆసుపత్రుల్లో డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేసినా ఇవి తగిన రీతిలో సేవలందించలేక పోతున్నాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకునేందుకు పేరు నమోదు చేసుకుంటే వారికి వైద్య సేవలు అందేందుకు మూడు, నాలుగు నెలల సమయం పడుతోంది. ప్రధానంగా జిల్లాలో కాకినాడ జీజీహెచ్‌తో పాటు రాజమహేంద్రవరంలోని జిల్లా ఆసుపత్రిలో పరిస్థితి దయనీయంగా ఉంది. విధిలేని పరిస్థితిలో బాధితులు అప్పులు చేసి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.ఆర్థిక స్థోమత లేని వారు డయాలసిస్ చేయించుకోలేక ప్రాణాపాయ స్థితికి చేరుకోవాల్సి వస్తోంది. జిల్లాలోని కాకినాడ జీజీహెచ్, రాజమహేంద్రవరంలోని జిల్లా ఆసుపత్రికి వందల సంఖ్యలో డయాలసిస్ రోగులు వస్తుంటారు. వీరి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా ఇక్కడ సరిపడినన్ని డయాలసిస్ యంత్రాలు లేకపోవడం ప్రతిబంధకంగా మారుతోంది.అమలాపురం, తుని, రంపచోడవరంలోని ఆసుపత్రుల్లో డయాలసిస్ యూనిట్లు ఉన్నా స్థానిక రోగుల అవసరాలకే ఇవి సరిపోతున్నాయి. దీంతో అధిక సంఖ్యలో రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. రాజమహేంద్రవరంలోని జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్న వారు ఇప్పటికే 300 మంది ఉండగా నిరీక్షణ జాబితాలో మరో 170 మంది ఉన్నారు. కాకినాడ జీజీహెచ్‌లో ప్రస్తుతం 320 మంది డయాలసిన్ చేయించుకుంటుండగా నిరీక్షణ జాబితాలో మరో 90 మంది ఉన్నారు. ఈ కేంద్రాల్లో ఇప్పటికే డయాలసిస్ చేయించుకుంటున్న వారికి తప్ప కొత్తవారికి అవకాశం కల్పించలేక పోతున్నారు.ఆయా కేంద్రాల్లో రోగులు రోజంతా నిరీక్షించాల్సి వస్తోంది.
మూత్రపిండాల రోగులు డయాలసిస్ చేయించుకోవాలంటే ప్రైవేటు ఆసుపత్రుల స్థాయిని బట్టి రూ.2,500 నుంచి రూ.4,000 వరకు వసూలు చేస్తున్నారు. వారానికి రెండు సార్లు ఈ సేవలు పొందాలంటే సుమారు రూ.ఆరు వేలు ఖర్చవుతోంది. పేద ప్రజలకు ఇది తీవ్ర భారంగా పరిణమిస్తోంది. దీంతో కొన్ని సందర్భాల్లో అప్పులు చేయాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.