యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అసలే చలికాలం.. అందులో గిరిసీమ... తెల్లవారుజామునే లేవాలి.. చన్నీళ్లతో స్నానం.. గుర్తుకు తెచ్చుకుంటనే వణుకుపుడుతుంది కదూ... ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థుల గురించి ఓసారి ఆలోచించండి... అదే మన పిల్లలయితే ఇలాగే చూస్తూ ఊరుకుంటామా..? ఏమవుతుందిలే అని సర్దుకుపోతామా..? మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేయలేదా అంటే చేసింది.. రూ.లక్షల ఖర్చు చేసి పలు ఆశ్రమ పాఠశాలల్లో సోలార్ హీటర్లు బిగించింది. వారికి వేడునీళ్లు ఇచ్చేలా చేసింది... అంతవరకు బాగానే ఉన్నా.. ఇవి బిగించి ఏడాది గడిచినా నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ఫలితంగా అవి నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. పిల్లలేమో చలికి అష్టకష్టాలు పడుతున్నారు.
గుమ్మలక్ష్మీపురం మండలంలో పి.ఆమిటి, రేగిడి, కొత్తగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఏడాది కిందట సౌర వేడినీటి పథకాలు ఏర్పాటు చేశారు. అయితే పరికరాలు ఏర్పాటు చేయడంపై ఉన్న శ్రద్ధ ఉపయోగంలోకి తేవడంపై లేకపోవడంతో ప్రస్తుతం రూ.లక్షలు విలువ చేసే పరికరాలు దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి. చేసేది లేక విద్యార్థులు చన్నీళ్ల స్నానాలు చేయక తప్పటం లేదు. అసలు ఎందుకు పరికరాలు ఏర్పాటు చేశారో కూడా తెలియని పరిస్థితి నెలకొందంటే వాటి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పరికరాలు ఏర్పాటు చేసినా ఐటీడీఏ అధికారులకు తెలియాల్సి ఉంది. కాని సోలార్ వేడినీటి పరికరాలు ఏర్పాటు విషయం మాత్రం ఐటీడీఏ అధికారులకు తెలియకపోవడం గమనార్హం. అసలు ఎవరు ఏర్పాటు చేశారు, ఎంత నిధులు, ఎప్పటిలోగా వినియోగంలోకి తెస్తారో కూడా ఆయా పాఠశాలల సిబ్బందికి తెలియడంలేదు. శిథిలావస్థలో ఉన్న శ్లాబులపైన పరికరాలు ఏర్పాటు చేసి, చేతులు దులిపేసుకున్నారు. ప్రారంభించిన తొలి రోజుల్లో పథకాలు నుంచి నీరు లీకైనట్లు ఆయా పాఠశాలల సిబ్బంది చెబుతున్నారు.
మన ఇంట్లో రూ.100 వస్తువు కొనుగోలు చేస్తే.. అది మరమ్మతులకు గురైతే వెంటనే వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ సొమ్మేగా పోతేపోని అన్న చందంగా అధికారులు ఆలోచిస్తున్నారో ఏమో తెలియదు కాని రూ.లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పరికరాలను నిరుపయోగంగా వదిలేయడంతో నిధులు వృథా అయ్యాయే తప్ప ఏమాత్రం ప్రయోజనం చేకూరడం లేదు. విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పరికరాలు వినియోగంలో లేకపోవడంతో నిధులు నీళ్లలో పోసిన పన్నీరులా మారాయి. కొన్నిచోట్ల ఇప్పటికే సోలార్ పలకలు శిథిలమై దర్శనమిస్తునాయి. ఏర్పాటు చేసిన ట్యాపులు సైతం మరమ్మతులకు గురయ్యాయి.