యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
వచ్చే విద్యాసంవత్సరం నుండి ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బిఈడీ ఇతర వృత్తి సాంకేతిక విద్యా కోర్సుల ఫీజులు భారీగా పెరగనున్నాయి. కాలేజీల వారీ, కోర్సుల వారీ, కోటా వారీ ఫీజులు పెరుగుతాయి. సాధారణ , మధ్యతరగతి కాలేజీల ఫీజుల్లో పెద్దగా వ్యత్యాసం రాకున్నా మంచి రేటింగ్ ఉన్న కాలేజీల ఫీజులు మరింత ఎక్కువ కానున్నాయి. ప్రధానంగా నేక్ గుర్తింపు పొంది, ఎన్‌బీఏ అక్రిడిటేషన్ పొందిన కాలేజీలు, 20 ఏళ్లకు పైబడి పనిచేస్తున్నవీ, సకల సదుపాయాలు, కెరీర్ అవకాశాలు బాగున్నవీ, మంచి ఫ్యాకల్టీ , టాప్‌ర్యాంకర్లు చేరుతున్న విద్యాసంస్థలను మంచి రేటింగ్ ఉన్న సంస్థలుగా గుర్తించారు. ఇంజనీరింగ్‌లో మంచి రేటింగ్ ఉన్నవి ఒక ఇరవై కాలేజీలను తీసుకుంటే , అలాగే ఎంబీఏ, ఎంసీఏ, బిఈడీ, లా, పీజీ కాలేజీలు ఎంపిక చేస్తే దాదాపు 150 మంచి కాలేజీలు వస్తాయి. వీటిలో ఫీజులు ఆకాశాన్ని తాకనున్నాయి. ప్రస్తుతం ఇంజనీరింగ్‌లో గరిష్టంగా కన్వీనర్ కోటా ఫీజు 2 లక్షలు ఉంది. అదే ఎంబీఎకు 43వేలు, ఎంసీఏకు 80వేలు ఫీజు వసూలుచేస్తున్నారు.ఏడాది ఈ ఫీజులు చూస్తే కన్వీనర్ కోటాలో 1,13,500 ఉండగా, అంతకు ముందు సంవత్సరానికే 90వేల వరకూ పెరిగింది. ద్వితీయ స్థాయి కాలేజీలను తీసుకుంటే కన్వీనర్ కోటా 1.05 లక్షలు ఉండగా, 2015లో అది 76,900 మాత్రమే. వాటిలో ఫీజు అకస్మాత్తుగా 30వేల వరకూ పెంచారు. కొన్ని కాలేజీలు తెలంగాణ ఎఎఫ్‌ఆర్‌సీ అనుమతి పొందకుండానే ఇష్టానుసారం ఫీజులు పెంచాయి. దీనిపై తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలే చేశారు. చివరికి సుప్రీంకోర్టు వరకూ తల్లిదండ్రులు వెళ్లడంతో ఏఎఫ్‌ఆర్‌సీ అనుమతి లేకుండా ఫీజులు పెంచడానికి వీలు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణలో మూడు సెంట్రల్ యూనివర్శిటీలు, రెండు జాతీయ స్థాయి విద్యాసంస్థలు, ఒక రాష్ట్ర స్థాయి యూనివర్శిటీ, రెండు డీమ్డ్ వర్శిటీలు కలిపి కేంద్రం పరిధిలోకి వచ్చే సంస్థలు 8 ఉండగా, రాష్ట్ర యూనివర్శిటీలు 16 ఉన్నాయి. రాష్ట్రంలో గుర్తింపు పొందిన ఇంజనీరింగ్ కాలేజీలు 266 కాగా వాటిలో 1,26,468 సీట్లున్నాయి. 145 ఫార్మసీ కాలేజీల్లో 11,438 సీట్లు, 49 ఎంసీఏ కాలేజీల్లో 2966 సీట్లు, 347 ఎంబీఏ కాలేజీల్లో 41,796 సీట్లు, 225 బిఈడీ కాలేజీల్లో 22670 సీట్లు, 17 లా కాలేజీల్లో 2850 సీట్లు, 1278 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 2,83,823 సీట్లు 171 ఎంటెక్ కాలేజీల్లో 15152, 130 ఎం ఫార్మసీ 7820 సీట్లు, 13 ఎల్‌ఎల్‌ఎం కాలేజీల్లో 580 సీట్లు, 18 బీపీఈడీ కాలేజీల్లో 1760 సీట్లు, యూజీడీ పీఈడీ నాలుగు కాలేజీల్లో 350 సీట్లు ఉన్నాయి. డిగ్రీ సీట్లు కాకుండా వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లోనే దాదాపు 2.33 లక్షల సీట్లున్నాయి. వీటన్నింటి భర్తీకి ఇప్పటికే ఉన్నత విద్యా మండలి ప్రవేశపరీక్షల షెడ్యూలును, కన్వీనర్లను ప్రకటించింది. అడ్మిషన్ల సమయానికే ఫీజులపై ఒక స్పష్టమైన విధానాన్ని అనుసరించేందుకు వీలుగా కాలేజీలకు అవకాశం ఇచ్చింది. ఏఎఫ్‌ఆర్‌సీ తన నోటిఫికేషన్‌ను సోమవారం నాడు విడుదల చేసింది.నోటిఫికేషన్‌కు స్పందిస్తూ కాలేజీలు ఈ నెల 25వ తేదీ నుండి తమ స్వీయ నివేదికలను, ఆడిటర్ రిపోర్టులను , ఆదాయ- వ్యయ నివేదికలను ఇవ్వాల్సి ఉంటుంది. స్వీయ నివేదికలను ఏఎఫ్‌ఆర్‌సీ ఫిబ్రవరి 21 వరకూ స్వీకరించనుంది. అనంతరం వివిధ కాలేజీలు సమర్పించిన నివేదికల వివరాలను వెబ్ పోర్టల్‌లో ఫిబ్రవరి 25వ తేదీన అందుబాటులో ఉంచుతారు. అనంతరం నివేదికను అధ్యయనం చేసి ఫీజులకు సంబంధించి తుది నిర్ణయాన్ని తీసుకుంటారు.