యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అధికార పార్టీ ఎన్నికల సమరానికి సన్నద్ధమా అన్నట్టుగా బీసీ సదస్సు కు చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది. 27న రాజమహేంద్రవరం ఆర్ట్సు కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న జయహో బీసీ సదస్సును జయప్రదం చేసేందుకు నాయకులు మధ్య పోటీ నెలకొంది. ఎవరికి వారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సదస్సును నిర్వహించాలని ఆరాటపడుతున్నారు. ఇందుకు పెద్ద ఎత్తున సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. టీడీపీలోని వివిధ శ్రేణులు పోటా పోటీగా ఈ సదస్సుకు జయప్రదం చేసే లక్ష్యంలో తలమునకలయ్యాయి. ఈ సదస్సు నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్టు తెలుస్తోంది. దీంతో నేతలంతా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఈ సభపై దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే ఆయువుపట్టుగా ఉన్నారని మరోసారి నిరూపించే విధంగా ఈ సదస్సును నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్సు కాలేజి గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం 1 గంటకు మొదలయ్యే ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీల అభ్యున్నతికి కార్యాచరణ ప్రణాళిక ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈ సభను ప్రధానంగా గోదావరి జిల్లాల పార్టీ శ్రేణులు అత్యధికంగా తరలి రానున్నట్టు తెలిసింది. సదస్సుకు దాదాపు మూడు లక్షలకు పైగా హాజరయ్యేందుకు అవకాశం ఉందని అంచనా వేశారు. అందుకు తగిన విధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే శ్రేణులకు భోజన, వసతి సదుపాయాలతో ఆతిధ్యమిచ్చేందుకు స్థానిక పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గం నుంచి సోమవారం అమరావతి వెళ్ళిన నాయకులు ముఖ్యమంత్రి సదస్సు ఏర్పాటు వివరాలను తెలియజేసినట్టు తెలిసింది. ఇప్పటికే బీసీ నాయకులు ఉపకులాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ సదస్సుకు తరలివచ్చే విధంగా సమాయత్తం చేశారు. బీసీల సామాజికాభివృద్ధికి సంబంధించిన అంశాలను ఇప్పటికే ప్రధాన అజెండాలో వచ్చే విధంగా సమీకరించినట్టు తెలుస్తోంది