యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నెల్లూరు జిల్లాల్లో రూరల్ టీడీపీ తమ్ముళ్లు డైలామాలో ఉన్నారు. నెల్లూరు రాజకీయాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ జిల్లాలో ఇప్పటి వరకు లేని విధంగా రైతులకు మేలు చేసే కార్యక్రమం చేశారు. అన్నదాతలు గడిచిన 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న సీజీఎఫ్ ఎస్ భూముల సమస్యకు చంద్రబాబు ఒక్క కలం పోటుతో చెక్ పెట్టారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ గ్రాఫ్ పెరిగింది. ఇన్నాళ్లుగా జాలువారుతున్న తమ కన్నీటిని బాబు అర్ధం చేసుకున్నారని ఇక్కడి రైతులు చెబుతున్నారు. మరి ఈ ఆనందాన్ని ఓట్ల రూపంలో టీడీపీ మలుచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి గాను ఏంచేయాలి? ఇప్పుడు ఇదే ప్రశ్న వస్తోంది.చంద్రబాబు రైతుల విషయంలో చేసిన మేలును ఎక్కువగా నెల్లూరు గ్రామీణ రైతులు పొందారు. దీంతో వీరంతా కూడా టీడీపీకి అనుకూలంగా మారే అవకాశంమెండుగా ఉంది. అయితే, నెల్లూరు రూరల్ టీడీపీ నాయకుల్లో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో రైతులు పార్టీకి చేరువ అవుతారా? అనే సందేహం మాత్రం తెరమీదకి వస్తోంది. నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధంచి చంద్రబాబు అభ్యర్థిని ఖరారు చేశారు. మంత్రి నారాయణకు ఈ టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించి ఇక్కడ నెలకొన్న గందరగోళానికి తెరదించారు. దీంతో నారాయణ ప్రజల్లో తిరిగేందుకు నాయకులను సమన్వయం చేసుకునేందుకు, అసంతృప్తి తగ్గించేందుకు అవకాశం ఏర్పడింది. చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నా నారాయణ చేసిన అభివృద్ధి గురించి నెల్లూరు సిటీ జనాలు మాట్లాడుకోవడం మాత్రం ఆయనకు ప్లస్. అలాగే ఇక్కడ బలంగా ఉండే రెడ్డి సామాజికవర్గాన్ని ఆయన ఎలా సమన్వయం చేసుకుంటారన్నది కూడా చూడాలి.సిటీ నియోజకవర్గం వరకు నారాయణ రూపంలో టీడీపీకి కాస్త బలమైన అభ్యర్థే ఉన్నా రూరల్ పెద్ద తలపోటుగా మారింది. రూరల్ నియోజకవర్గానికి వచ్చేసరికి.. గడిచిన రెండు ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఇక్కడ టీడీపీ విజయం సాదించలేదు. 2009లో ఇక్కడ పొత్తులో భాగంగా సీటును కమ్యూనిస్టులకు ఇవ్వడం, గత ఎన్నికల్లో బీజేపీకి ఇవ్వడంతో ఇక్కడ టీడీపీ కేడర్ గందరగోళంలో పడింది. ఈ నేపథ్యంలో ఇక్కడ క్షేత్రస్తాయిలో నాయకులు ఎంతో కృషి చేయాల్సి న అవసరం ఉంది. అయితే, ఇక్కడ నేతల మధ్య టికెట్ కుస్తీలు పెరిగాయి. నాకంటే నాకని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ప్రజలలో కూడా గందరగోళం నెలకొంది. కీలకమైన సమయంలో ఎవరినో ఒకరిని తక్షణమే చంద్రబాబు నాయకుడిగా ప్రకటిస్తే.. మిగిలిన వారు కలిసి పనిచేసే వాతావరణం ఉంటుంది.గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి విజయం సాధించిన వైసీపీ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే ప్రజల్లో ఉన్నారు. టీడీపీలోని గందరగోళాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సిటీ నియోజకవర్గంలో వ్యవహరించిన విధంగానే ముందుగానే అభ్యర్థిని ప్రకటిస్తే.. పార్టీ పుంజుకునేందుకు గెలుపు గుర్రం ఎక్కేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు సీనియర్లు. ప్రస్తుతం నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆదాల ప్రభాకర్‌రెడ్డే రూరల్ ఇన్‌చార్జ్‌గా కూడా ఉన్నారు. అయితే ఆయన ఫైనల్‌గా ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం క్లారిటీ లేదు. అలాగే కోవూరులోనూ ఆయన పేరు వినిపిస్తోంది. ఆదాల పోటీ చేసే ప్లేస్ డిసైడ్ అయితే మూడు సీట్లలో టీడీపీ అభ్యర్థులపై ఓ క్లారిటీ వస్తుంది. మరి ఆదిశగా బాబు చొరవ చూపాల్సిన అవసరం ఉంది