YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చక్రబంధంలో రాహుల్ గాంధీ

చక్రబంధంలో రాహుల్ గాంధీ
ఉత్తరప్రదేశ్ ఫీవర్ రాహుల్ ను వదిలిపెట్టడం లేదా? యూపీలో తమకు రెండు స్థానాలనే కేటాయిస్తామని సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. గ్రాండ్ ఓల్డ్ పార్టీని అవమానపర్చినా లోలోపల బాధను దిగుమింగుకుంటోంది హస్తం పార్టీ. కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టడానికి కూడా కారణాలు చెప్పారు అఖిలేష్ యాదవ్. అక్కడ బలంలేని పార్టీని కూటమిలో చేర్చుకోవడం కంటే, బలమున్న పార్టీలు జత కడితేనే బీజేపీని ఓడించగలమన్న ఫార్ములాను తాము ఉపయోగిస్తున్నామని చెప్పారు అఖిలేష్. దీంతో కాంగ్రెస్ 80 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.అయితే యూపీ ఫార్ములా ఇప్పుడు ఇతర రాష్ట్రాలకూ పాకుతుందేమోనన్న కలవరం కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమయింది. దక్షిణాదిన కర్ణాటకలో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ అక్కడ జనతాదళ్ ఎస్ 12 పార్లమెంటు స్థానాలను కోరుతోంది. నిజానికి జనతాదళ్ ఎస్ కు అంత బలం లేదన్నది కాంగ్రెస్ అభిప్రాయం. క్యాడర్ నుంచికూడా అన్ని సీట్లు కేటాయించవద్దన్న వత్తిడి వస్తోంది. ఈనేపథ్యంలో జనతాదళ్ ఎస్ ఐదు నుంచి ఆరుస్థానాలకు మించి ఇవ్వకూడదన్న అభిప్రాయంలో కాంగ్రెస్ ఉంది. ఒకవేళ జేడీఎస్ అడిగినన్ని సీట్లు ఇవ్వకుంటే ఆ ప్రభావం లోక్ సభ ఎన్నికలపై మాత్రమే కాకుండా, సంకీర్ణ సర్కార్ పై పడుతుందన్నఅనుమానమూ కాంగ్రెస్ లో లేకపోలేదు. యూపీ తరహాలోనే బీహార్ లో ఆర్జేడీ వ్యవహరిస్తుందన్న అనుమానం కూడా ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ బీహార్ రాజకీయాల్లో ప్రముఖంగా మారారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలోనూ విజయం సాధించి తేజస్వి యాదవ్ తన నాయకత్వ ప్రతిభను చాటుకున్నారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక సీట్లు సాధించి జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించి, తన తండ్రికి కేసుల నుంచి విముక్తి కల్పించాలన్న యోచనలో తేజస్వి ఉన్నాడంటున్నారు. అందుకోసమే ఈసారి బీహార్ లోనూ కాంగ్రెస్ కు తక్కువ స్థానాలు కేటాయించాలన్న ఆలోచనలో తేజస్వీ ఉన్నారనిచెబుతున్నారు. తేజస్వి బీజేపీ యేతర కూటమి ఏర్పాటు చేసిన సభలకు హాజరవుతూ హైలెట్ అవుతున్నారు.బీహార్ లో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకంటే లాలూ యాదవ్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ బలంగాఉందనిచెప్పక తప్పదు. మొత్తం 40 లోక్ సభ స్థానాలున్న బీహార్ లో ఇప్పటికే బీజేపీ, జేడీయూ కలసి చెరి పదిహేడు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇక ఇక్కడ కాంగ్రెస్, ఆర్జేడీ, హిందుస్తాన్ ఆవామీ మోర్చా మహాగడ్బంధన్ గా ఏర్పడ్డాయి. బీహార్ లో ఎక్కువ స్థానాలను దక్కించుకోవాలనుకున్న రాహుల్ అందుకోసం పాట్నాలో భారీ సభను ఏర్పాటు చేశారు. వచ్చే నెల 3న జరగనున్న ఈ సభకు బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఆహ్వానిస్తున్నారు. తేజస్వి దూకుడుకు ఈ సభ ద్వారా కొంత అడ్డుకట్ట వేసి ఎక్కువ స్థానాలను పొత్తులో భాగం సాధించుకోవాలన్నది హస్తం పార్టీ వ్యూహంగా కన్పిస్తోంది. మొత్తం మీద గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ సీట్ల కోసం చిన్న పార్టీలతో అడ్జస్ట్ అవుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Related Posts