యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఇన్నేళ్లు కష్టపడి ఓ కొలిక్కి తెచ్చిన పార్టీలో ఇప్పుడు అసంతృప్తి సెగలు పొగలు కక్కుతున్నాయా? అధినేత వ్యవహార శైలితో మిగిలిన నాయకులు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారా? అంటే.. విపక్షం వైసీపీలో ఇదే కనిపిస్తోంది. ఇప్పటికే అధినేత జగన్ ఏకపక్ష నిర్ణయాలతో పార్టీలో ఎవరూ మాట్లాడేందుకు కూడా సాహసం చేయడం లేదు. దీంతో పార్టీలో ఇప్పటికే ఎవరికివారే యమునా తీరే అన్నచందంగా పరిస్థితి మారింది. ఇక, ఇప్పుడు జగన్ వ్యవహార శైలితో పెరుగుతున్న అసంతృప్తులు పార్టీని ఎన్నికల ముంగిట మరింత పలుచన చేయడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.గతంలో పార్టీ విషయంలోను, ఎంపీలు, ఎమ్మెల్యేల విషయంలోనూ జగన్ తీసుకున్న నిర్ణయాలు పార్టీలోనే ఇబ్బందికర పరిస్థితిని కల్పించాయి. ప్లీనరీ వేదికగా 2017లోనే జగన్ తన పార్టీ.. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలను ముందుగానే ఈ వేదికగా ప్రకటించారు. దీంతో అప్పట్లోనే బొత్స సత్యనారాయణ, మేకపాటి రాజమోహన్‌రెడ్డి వంటి సీనియర్లు తలలు పట్టుకున్నారు. ప్రత్యర్థులకు ముందుగానే మన గుట్టు చెప్పినట్టుగా వ్యవహరిస్తున్నారని, దీనివల్ల ప్రయోజనం లేకపోగా.. చాణక్యుడు వంటి చంద్రబాబుకు అడ్డంగా దొరికిపోవడమే అవుతుందని చెప్పారు. ఇక, అసెంబ్లీకి వెళ్లకుండా బాయ్ కాట్ చేయడంపైనా జగన్‌పై అసంతృప్తి ఉంది.చాలా మంది ఎమ్మెల్యేలు.. 2014లో చాలా ఖర్చు చేసి గెలిచారు. మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజల తరఫున ప్రభుత్వా న్ని నిలదీసినట్టు కనిపించాలి. కానీ, ఈ అవకాశాన్ని జగన్ చేజేతులా పోగొట్టుకున్నారు. ఇది కూడా మెజారిటీ ఎమ్మెల్యే ల్లో అసంతృప్తి నింపింది. ఇక, ఎంపీల రాజీనామా విషయం మరింత అసంతృప్తికి గురి చేసింది. మేకపాటి రాజమోహన్ రెడ్డి వంటివారు రాజీనామాకు ఒప్పుకోలేని విషయం ప్రస్తావనార్హం. కనీసం తమకు మాట కూడా చెప్పకుండానే రాజీనామా చేయమంటే ఎలా అనే పుల్లవిరుపు మాటలు అప్పట్లోనే వినిపించాయి. ఇక, ఇప్పుడు కేటీఆర్‌తో చర్చల విషయంలోనూ పార్టీలో ఎవరితోనూ చర్చించకపోవడాన్ని సీనియర్లు తప్పుపడుతున్నారు.వైసీపీలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంది అయితే, ఇక్కడ ఒకే ఒక కారణంగా వారు వైసీపీలో కొనసాగక తప్పడం లేదు. మరో ప్రత్యామ్నాయం లేక పోవడమే వారిని వైసీపీలో కొనసాగేలా చేస్తోంది. అయితే, మానసికంగా తీవ్ర గందరగోళంలో ఉన్న నాయకులు ఇదే పద్ధతిలో ఎన్నికలకు వెళ్తే.. అటు సాంకేతికంగా విజయం అటుంచితే.. నైతికంగా ప్రారంభంలోనే ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఏదేమైనా.. జగన్ పట్టు విడుపుల ధోరణిని ప్రదర్శించి. పార్టీని, నేతలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు సీనియర్లు