యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కర్నాటకంలో నాటకం సాగుతూనే ఉంది. రోజుకో మలుపు తిరుగుతున్న క్యాంపు రాజకీయాలు ప్రభుత్వాన్ని నిలబెడతాయా పడగొడతాయా అన్న సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ''ఆపరేషన్ ఆకర్ష్' ద్వారా కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణాన్ని కూల్చేయాలన్న ప్రయత్నాలు బెడిసికొట్టడంతో కమల నాథులు కొత్త ఎత్తుగడలకు వ్యూహ రచన చేస్తుండగా... ఇటీవలి సీఎల్పీ సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం కాంగ్రెస్ వర్గాలను కలవరపెడు తున్నది. దీంతో ఆపరేషన్ లోటస్‌ను దీటుగా తిప్పికొట్టి బీజేపీని కంగు తినిపిం చామన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థంకాని అయోమయంలో పడింది. ఇప్పటికే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించిన ఇద్దరు స్వతంత్రులకు తోడు, తప్పనిసరిగా హాజరు కావాలన్న అధిష్టానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ నలుగురు స్వపక్ష సభ్యులు సీఎల్పీకి గైర్హాజరుకావడంతో ఇప్పుడు కంగుతినడం కాంగీయుల వంతైంది..! ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ క్యాంపులోని అసమ్మతి ఎమ్మెల్యేలిద్దరు ఘర్షణ పడి కొట్టుకుని ఆస్పత్రిపాలవ్వడం కొత్త మలుపు. ఇటువంటి సంఘటనలతో ఇంకా కొనసాగుతున్న క్యాంపు రాజకీయాలు కన్నడ సీమను వేడెక్కి స్తున్నాయి. రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా అధికారానికి అడుగు దూరంలోనే ఆగిపోయింది. 224 స్థానాలున్న కర్నాటకలో 104సీట్లు గెలుచుకున్నా మ్యాజిక్ ఫిగర్‌కు 9సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో 80సీట్లకే పరిమితమైనప్పటికీ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదిపి మరో ఇద్దరు స్వతంత్రులు, ఒక బీఎస్‌పీ ఎమ్మెల్యేను కలుపుకుని 37 సీట్లున్న జేడీఎస్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీజేపీ ఆశలను వమ్ము చేసింది. నీవు నేర్పిన విద్యే నీరజాక్షా అన్నట్టుగా గోవా, మణిపూర్, మేఘాల యాల్లో బీజేపీ అనుసరించిన వ్యూహాన్నే కర్నాటకలో కాంగ్రెస్ అమలుపరించింది. కాకపోతే నేతృత్వం జేడీఎస్‌కు అప్పగించడం తప్పనిసరైంది. అప్పటి నుంచీ ఈ సంకీర్ణం అనేక సవాళ్ల మధ్యే సాగుతున్నది. తాజాగా మంత్రి వర్గం నుంచి ఉద్వాసనకు గురైన కాంగ్రెస్ నేత రమేష్ జార్కిహోళి మరో నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి అసమ్మతి బాట పట్టడంతో అవకాశం కోసం చూస్తున్న బీజేపీ ఆలస్యం చేయకుండా అపరేషన్ ప్రారంభించింది. కానీ అంతేవేగంగా కాంగ్రెస్ అప్రమత్తం కావడం, ఇద్దరు స్వతంత్రులు తప్ప ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ అసంతృప్తులు కలిసిరాకపోవడంతో బీజేపీ వ్యూహం వికటించింది. పైగా అనైతిక, అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారన్న అప్రతిష్ట తెచ్చింది. దీంతో కాసేపు సంక్షోభం సద్దుమణిగినట్టే కనిపించినా.... సంకీర్ణంలోని వైరుధ్యాలకు తోడు అంతర్గత అసంతృప్తులు గట్టిగానే ఉన్నాయని నిర్థారించుకున్న బీజేపీ తన ప్రయత్నాలను విరమించుకోకపోగా కొత్తమార్గాలకు తెరతీయ డంతో ఆట మళ్లీ మొదలయింది. ఈ ఆటలో ఎవరికి కావాల్సిన ముగింపునకు వారు ప్రయత్ని స్తుండటంతో ఊహించని మలుపులతో ఇరు పార్టీల క్యాంపు రాజకీయాలు ఇంకా కొనసాగు తూనే ఉన్నాయి.సరే ప్రభుత్వాన్ని పడ గొట్టాలన్న దృఢనిశ్చయంతో ఉన్న కమలనాథులకు కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు కొత్త వ్యూహాలకు రెక్కలు తొడి గాయి. ఇప్పటికే ఇద్దరు స్వతంత్రులు, నలుగురు అసమ్మతివాదులతో ప్రభుత్వం బలం తగ్గిందని భావిస్తున్న కాషాయంబరులు మరికొందరు అసంతృప్తులను తమవైపునకు తిప్పుకోగలిగితే అవిశ్వాస తీర్మానాన్ని ప్రయోగించి, రాజ్యాంగబద్ధంగానే అధికారాన్ని వశం చేసుకోవచ్చునని వ్యూహరచన చేస్తున్నారు. ప్రభుత్వానికీ తమకూ సంఖ్యాబలంలో తేడా అతి స్వల్పమేననీ, ఆ మేరకు కాంగ్రెస్ అసంతృప్తులతో క్రాస్ ఓటింగ్ చేయించినా పీఠం దక్కుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. కాగా... తాజాగా కాంగ్రెస్ క్యాంపులో 20మందికి పైగా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రాజీనామా కోరాలనే డిమాండ్ ముందుకు తెస్తుండటం మరో మలుపు. ఇది కాంగ్రెస్‌కే కాదు జేడీఎస్‌కూ మింగుడుపడని అంశం. ఇప్పటికే కాంగ్రెస్ వత్తిళ్లకు తట్టుకోలేకపోతున్నానని కంటతడి పెట్టడమే కాక, తానో క్లర్క్‌లా పని చేస్తున్నానని ఆవేదన చెందుతున్న ముఖ్యమంత్రి కుమారస్వామిని.. ఇప్పుడు రాజీనామా కోరాలనే అభిప్రాయాలు కాంగ్రెస్‌లో వెలువడుతుండటం సహజంగానే జేడీఎస్ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎనిమిది నెలల ఈ సంకీర్ణం ఏ తీరం చేరుతుందో వేచి చూడాలి. సార్వత్రిక ఎన్నికల లోపే గద్దెనెక్కాలన్నది బీజేపీ ఆరాటం....! ఇటీవలి చేదు ఫలితాలే కాదు, ముందున్న ప్రతికూలతలు కూడా కమలదళాన్ని ఆందోళనకు గురి చేస్తున్నట్టున్నాయి. ఎన్నికలనాటికి ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే అన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీకుండే అవకాశాలను ఉపయోగించుకుని పోల్ మేనేజ్‌మెంట్‌లో పై చేయి సాధిం చవచ్చన్నది వారి తలంపుగా కనిపిస్తున్నది. ఇప్పటికే ఉత్తరాదిన ఎదురు దెబ్బలూ, విపక్షాల సరికొత్త సమీకరణలూ కలవర పెడుతుండగా... అసలే అంతంతమాత్రమైన తమ దక్షిణాది అవకాశాలకు కర్నాటకలో అధికారం కలిసొస్తుందని భావిస్తున్నట్టున్నారు. అధికారం ఎంతకు దిగజారుస్తుందో కదా...! ఈ ''కుర్చీ'' లాటలో ఎటు చూసినా అవకాశవాదం, అధికారదాహమే తప్ప విలువలకు చోటు లేకపోవడం విచారకరం.