యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
టిడిపి, వైసిపి లకు బలమైన ప్రత్యామ్నాయంగా జనసేన ఎదగాలని ప్రయత్నం చేస్తుంది. అయితే రాజకీయ ముదుర్లు చంద్రబాబు, జగన్ ల ఎత్తుగడలతో పవన్ జనసైనికుల్లో గందరగోళం రేకెత్తించేలా తయారయ్యింది. కొంత కాలం వైసిపి తో పొత్తు ఖరారు కాబోతుంది అంటూ రూమర్లు చెలరేగుతూ ఉంటాయి. అది చల్లారింది అనేలోగా టిడిపి తోనే పవన్ జత కట్టడం ఖాయం అన్న రీతిలో ప్రచారం మొదలౌతుంది. ఈ విభిన్న ప్రచారాల తీరు ప్రజల్లో ఒక విధమైన గందరగోళానికి లోను చేస్తున్నాయి. ఏపీలో ప్రధాన పార్టీలైన టిడిపి, వైసిపి లకు కావలిసింది కూడా ఇదే. జనసేన ను మూడో స్థానంలోకి మానసికంగా నెట్టివేసేలా ఇరు పార్టీలు నడిపిస్తున్న మైండ్ గేమ్ లో పవన్ గట్టిగానే నలిగిపోతున్నారు. ఇక మెతక వైఖరి అసలుకే ఎసరు తెస్తుందని ఆలస్యంగా గ్రహించారు.రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ జనసేనతో టిడిపి పొత్తు ఖాయమే అన్న రీతిలో చేసిన వ్యాఖ్యలపై పవన్ ఒక రేంజ్ లో చెలరేగిపోయారు. స్ట్రాంగ్ వార్నింగ్ టిడిపికి పంపారు. జనసేన లో జరిగిన అంతర్గత చర్చల్లో ప్రజారాజ్యం లాగే పీకే పార్టీని తొక్కేసే ప్రయత్నాలు ఆదిలోనే గుర్తించి స్పందించాలన్న వత్తిడి వచ్చిందని తెలుస్తుంది. దాంతో పవన్ నేరుగా టిజీ పై మాటల తూటాలు పేల్చారు. యధావిధిగా బాబు తమ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆయన మీడియా లో భారీ ప్రచారం సాగిపోయింది. వాస్తవానికి అధిష్టానం ఆదేశాలు లేకుండా టిడిపిలో ఎవరుబడితే వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే స్వతంత్రం లేదు. కానీ టిజి పొత్తుల వంటి కీలక అంశంపై నేరుగా వ్యాఖ్యానించడం అనేది పసుపు వ్యూహంలో భాగమే అన్నది విశ్లేషకుల అంచనా. తమ వ్యాఖ్యల ద్వారా పవన్ స్పందన చూడాలనుకున్న టిడిపి జనసేన పై మాటల దాడి చేయరాదని ఇప్పటికే ఆదేశించింది. దాంతో పవన్ ఘాటుగా స్పందించినా పసుపు పార్టీలో మౌనమే రాజ్యం ఏలడం గమనార్హం.