యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో వైసీపీ అధినేత జగన్ కు సీట్ల కేటాయింపు తలనొప్పిగా మారింది. సామాజికవర్గాలే జగన్ ను ఇబ్బందిపెట్టేదిగా కన్పిస్తోంది. చిత్తూరు జిల్లాలో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబునాయుడిని దెబ్బతీసి మరీ అధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఈసారి కూడా అదే రేంజ్ లో సీట్లు సాధించాలని జగన్ భావిస్తున్నారు. కులసమీకరణాలే కొంత డిజంట్వాజీగా జగన్ కు మారాయని చెబుతున్నారు. అయితే జగన్ సొంత సామాజిక వర్గమైన రెడ్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శల నుంచి బయటపడాలనుకుంటున్నారా? కొత్త ప్రయోగాలను చేసేందుకు సిద్ధమవుతున్నారా? అన్నది తేలాల్సి ఉంది.తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించాకే చిత్తూరు జిల్లాలో అభ్యర్థుల పేర్లను రిలీజ్ చేయాలన్న యోచనలో జగన్ ఉన్నారు. ఈ మేరకు జగన్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో మూడు రిజర్వ్ డ్ నియోజకవర్గాలున్నాయి. సత్యవేడు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి. ఇక మిగిలిన 11 నియోజకవర్గాలు జనరల్ వే. అయితే ఈ 11 నియోజకవర్గాల్లో ఒక్క కుప్పంలో మాత్రం బీసీ అభ్యర్థిని బరిలోకి దించనున్నారు జగన్. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపైన పోటీ చేసిన చంద్రమౌళినే తిరిగి నిలబెట్టాలని ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు.కుప్పం మినహాయిస్తే మిగిలిన పది నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం నేతలు పోటీలో ముందువరుసలో ఉన్నారు. ఇప్పటికే ఎనిమిది నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే ఖరారయ్యారు. తిరుపతి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పీలేరు నుంచి చింతల రామచంద్రారెడ్డి, పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగరి నుంచి రోజా, శ్రీకాళహస్తి నుంచి మధుసూదన్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గం నుంచి దేశాయి తిప్పారెడ్డి, తంబళ్లపల్లి నుంచి ద్వారకానాధరెడ్డి పేర్లకు జగన్ టిక్ పెట్టేశారు. వీరంతా రేపటి ఎన్నికల్లో బరిలో ఉండనున్నారు. ఈ ఎనిమిది నియోజకవర్గాల్లోనూ రెడ్డి సామాజిక వర్గ నేతలకే అనివార్యంగా టిక్కెట్ ఇవ్వాల్సిన పరిస్థితి జగన్ ది. చిత్తూరు, పలమనేరు ఉన్నాయి. చిత్తూరు విషయానికొస్తే అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన జంగాలపల్లి శ్రీనివాసులు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈయన బలిజ సామాజికవర్గానికి చెందిన నేత. అయితే చిత్తూరులో పోటీ చేయడానికి సీకేబాబు రెడీ అంటున్నారు. ఆయన తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్ కు అత్యంత సన్నిహితుడైన సీకే బాబు (జయచంద్రారెడ్డి) పార్టీలో చేర్చుకోవాలని జగన్ కు ఉన్నా, ఆ సీటుకూడా రెడ్డి సామాజికవర్గానికి ఇస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని ఆలోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పలమనేరు విషయానికొస్తే అక్కడ సినీ నిర్మాత రాకేష్ రెడ్డితో పాటు వెంకటేష్ గౌడ్ కూడా టిక్కెట్ కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. రాకేష్ రెడ్డికి ఇచ్చేందుకు జగన్ సుముఖంగా లేకపోవడానికి కారణం సామాజికవర్గమే అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు సొంత జిల్లాలో సామాజికవర్గాల సమతుల్యాన్ని పాటించాలని జగన్ ఎంతగా ప్రయత్నిస్తున్నా కుదరడం లేదంటున్నారు. ఇప్పటివరకూ ఎనిమిది మందికి టిక్కెట్లు ఖరారయినట్లే.