యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కర్నూలు నియోజకవర్గంలో ఈసారి హోరాహోరీ పోరు జరగనుంది. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే అస్త్రశస్త్రాలను రెడీ చేశాయి. అధికార తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ ఎవరికి కేటాయిస్తారన్న టెన్షన్ నెలకొని ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ పార్టీ అభ్యర్థిగా హఫీజ్ ఖాన్ ను గతంలో ప్రకటించింది. ఆయననే అభ్యర్థిగా ప్రకటిస్తారా? లేక కొత్త వారిని తీసుకువస్తారా? అన్న అనుమానం కూడా లేకపోలేదు. ఇక జనసేనకు ఇక్కడ పెద్దగా బలం లేకపోవడంతో ఈ స్థానాన్ని సీపీఎం వదిలిపెట్టేందుకు రెడీ అయింది. రెండుసార్లు కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించిన గఫూర్ ను తిరిగి బరిలోకి దించాలన్న ప్రయత్నంలో వామపక్ష పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో గెలుపు ఎవరదనే చర్చ జరుగుతోంది.కర్నూలు నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువ. వీరు గెలుపోటములపై ప్రభావితం చేస్తారు. సీపీఎం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గఫూర్ విజయానికి కూడా అదే కారణమని చెప్పాలి. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లిం అభ్యర్థినే బరిలోకి దించాలని దాదాపు నిర్ణయించింది. ముస్లిం ఓట్లతో పాటు ఇతర సామాజిక వర్గాల అండ తమకు ఉందని వైసీపీ భావిస్తోంది. కర్నూలు జిల్లాలో గత ఎన్నికల్లోనూ వైసీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. బలమైన ఓటు బ్యాంకు ఉన్న వైసీపీ ముస్లిం అభ్యర్థిని బరిలోకి దించితే గెలుపు ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తోంది.ఇక అధికార తెలుగుదేశంపార్టీలో టిక్కెట్ కోసం రగడ ఏడాది క్రితమే ప్రారంభమయింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎస్వీ మోహన్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన టీజీ వెంకటేష్ రెండువేల స్వల్ప ఓట్ల మెజారిటీతోనే ఓటమి పాలయ్యారు. దీన్ని బట్టి టీజీ కుటుంబానికి కర్నూలు నియోజకవర్గంలో ఎంత పట్టుందో అర్థంచేసుకోవచ్చు. అయితే ఈసారి ఎన్నికల్లో తన కుమారుడు టీజీ భరత్ కు టిక్కెట్ ఇవ్వాలని వెంకటేశ్ గట్టిగా కోరుతున్నారు. పార్టీ కోసం తాను పడిన శ్రమను గుర్తించాలని టీజీ అధినేత చంద్రబాబును గట్టిగా కోరుతున్నారు.వైసీపీ గుర్తు మీద గెలిచి టీడీపీలోకి జంప్ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కూడా టిక్కెట్ పై ధీమాగా ఉన్నారు. లోకేష్ గతంలోనే ఎస్వీని కర్నూలు అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో రెండు వర్గాలు పోటా పోటీగా కర్నూలు నియోజకవర్గంలో పర్యటిస్తుండటం విశేషం. అయితే ఇద్దరిలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా మరొక వర్గం పనిచేయదన్న టాక్ పార్టీలోనే విన్పిస్తోంది. సిట్టింగ్ ను కాదని వేరే వారికి ఎలా ఇస్తారని ఎస్వీ ప్రశ్నిస్తుండగా, సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతతో, సర్వేల ఆధారంగా తమకే టిక్కెట్ వస్తుందని టీజీ వర్గం బాహాటంగా చెబుతుండటం విశేషం. మొత్తం మీద కర్నూలు అసెంబ్లీలో ఈసారి త్రిముఖ పోటీ జరిగే అవకాశముండటంతో ఎవరిదిగెలుపు అన్న చర్చ జోరుగా జరుగుతోంది