యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ లో తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. ఆ పార్టీలో బలమైన నాయకులుగా ఉన్న కోట్ల కుటుంబం పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో నిలవడం ఇష్టంలేని మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే పార్టీకి నష్టం జరుగుతుందని పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన వారించారు. అసంతృప్తితో సమావేశం మధ్యలో నుంచే వచ్చేశారు.టీడీపీతో పొత్తు ఉంటుందని భావించిన ఆయన పొత్తులో భాగంగా కర్నూలు జిల్లాలో పోటీచేసి గెలవాలని భావించారు. పొత్తు ఉండదని తేలడంతో ఆయన పార్టీకి రాజీనామా చేయనున్నారు. త్వరలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. కార్యకర్తలతో చర్చించి రేపు ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. అయితే, కోట్ల సోదరుడు హర్ష మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది.