యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆస్పత్రిలో వివిధ అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు మంజూరయ్యాయి. వీటిని అవసరమైన వాటికి వినియోగించాల్సి ఉంది. ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిబంధనలకు అధికారులు తిలోదకాలిచ్చారు. ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారు. బాగున్న మరుగుదొడ్లను ధ్వంసం చేసి మరీ నిర్మిస్తున్నారు. పలు పనులకు అంచనాలను భారీగా పెంచేశారు. రోగులకు ఏమాత్రం ఉపయోగపడని పనులు చేస్తూ నిధులను వృథా చేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు.
నేషనల్ అక్యుడేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్‌లో భాగంగా సర్వజన ఆసుపత్రిలో వసతుల కల్పనకు అధికారులు చర్యలు చేపట్టారు. కేవలం మరుగుదొడ్ల నిర్మాణాలకు సుమారు రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ విభాగంలో మూడేళ్ల కిందట నిర్మించిన శౌచాలయాలను పడగొట్టి తిరిగి రూ.10 లక్షల నిధులతో వీటి పనులు ప్రారంభించారు. బాగా ఉన్నప్పటికీ వీటిని ధ్వంసం చేసి ఎన్‌బీఏహెచ్ కింద రూ.కోటితో వైద్యాలయంలోని వివిధ వార్డుల్లో మరుగుదొడ్ల పనులు ప్రారంభించారు. దీనిపై పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ సౌకర్యాలు ఉండేలా తీర్చిదిద్దేందుకు.. అత్యున్నత సౌకర్యాలు కలిగిన ఆసుపత్రులకు ఎన్‌ఏబీహెచ్ (నేషనల్ అక్యుడేషన్ బోర్డు
ఆఫ్ హాస్పిటల్స్) ధ్రువీకరణ పత్రం ఇస్తుంటుంది. రాష్ట్రంలో ఉన్న బోధన ఆస్పత్రుల్లో ఇలాంటి సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలపై ఈ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఆస్పత్రిలో తీసుకోవాల్సిన చర్యలపై ఎన్‌ఏబీహెచ్ ప్రత్యేక బృందం జిల్లాలో మూడుసార్లు పర్యటించి చేయాల్సిన పనులపై నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో కర్నూలు సర్వజన సర్వజన వైద్యశాలకు ప్రభుత్వం రూ.22 కోట్లు కేటాయించింది.
ఎన్‌ఏబీహెచ్ కింద ఏపీఎంఎస్‌ఐడీసీ విభాగానికి ప్రభుత్వం రూ.22 కోట్లు మంజూరు చేసింది. కర్నూలు సర్వజన వైద్యశాలలో ఈ నిధులతో వివిధ పనులు పెద్దఎత్తున సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయి. గైనిక్ విభాగం ఎదుట రోగుల సౌకర్యార్థం షెడ్లు వేశారు. వాస్తవానికి దీని నిర్మాణానికి రూ.6 లక్షలకన్నా ఎక్కువగా మించదు. కానీ దీనికి రూ.15 లక్షలు అంచనా వేయడం గమనార్హం. వైద్యుల వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా షెడ్డు ఏర్పాటుకు రూ.18 లక్షలు అవుతుందని అంచనా వేశారు. వైద్యుల వాహనాల కోసం ఇంత భారీగా నిధులు కేటాయించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పర్యవేక్షకుల ఛాంబరు, కార్డియాలజీ విభాగం విస్తరణ పేరుతో అనవసరంగా నిధులు వెచ్చిస్తున్నారు. మరుగుదొడ్లు, మార్బుల్స్, గ్రానెట్ వంటి పనుల కోసం అంచనాలు ఎక్కువగా చూపి గుత్తేదారులకు ప్రయోజనం చేకూరుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఆసుపత్రిలో కొన్ని పనులను అధికారులు తమ అనయాయులకు కట్టబెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇలా ఆస్పత్రిలో ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు రూ.కోట్ల నిధులు వృథాగా ఖర్చు చేసేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న పనులను చూస్తుంటే ఎంతో బాధేస్తోందని ఆస్పత్రిలో పనిచేసే ఓ కీలక అధికారే పేర్కొనడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.
సర్వజన వైద్యశాలలో అల్యూమినియం కంపోజ్ క్లాడిక్ (ఏసీపీ) కోసం రూ.70 లక్షలు, మరుగుదొడ్ల నిర్మాణాలకు రూ.కోటి వెచ్చిస్తున్న అధికారులు మరోవైపు వార్డుల్లో కూలర్ల ఏర్పాటు, రోగులు నడిచేందుకు వీలుగా అత్యవసరం విభాగం మొదట్లో మార్బుల్స్, ఆధునికీకరణ పేరుతో విద్యుత్తు మరమ్మతులకు మరో రూ.కోటి వరకు వెచ్చిస్తున్నారు. రహదారుల నిర్మాణాలకు రూ.2 కోట్లు, మాడ్యిలార్ ఓటీల పనులకు రూ.2 కోట్లు, వివిధ మరమ్మతు పనులకు రూ.కోటి, వార్డుల్లో తాగునీరు, విద్యుత్తు సౌకర్యాల కోసం మరో రూ.కోటి వెచ్చించారు. పలు వార్డుల్లో ఏసీలు, పంకాల ఏర్పాటు, అత్యవసర విభాగం ఆకట్టుకునేలా ఉండేందుకు బాగున్న నేలను తవ్వి గ్రానైట్ వేశారు. ఆసుపత్రిలో మురుగు వ్యవస్థ, దీనిని శుభ్రం చేసేందుకు రూ.3 కోట్లు కేటాయించారు. కార్పొరేట్ తరహాలో సౌకర్యాలు కలిగి ఉండడం వల్ల రోగులకు మెరుగైన వైద్యం అందుతుందని ప్రభుత్వం భావించింది. ఇందులో కొన్ని పనులు రోగులకు ఉపయోగపడుతున్నా.. చాలావరకు ఎవరికీ పనికిరాని వాటికి భారీగా నిధులు ఖర్చు చేసేస్తున్నారు. ఫలితంగా ఈ నిధులన్నీ వృథా అవుతున్నాయి.