యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
త్వరలోనే డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వబోతున్నామన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కోటి 40లక్షల మందికి స్మార్ట్ ఫోన్లు ఇవ్వబోతున్నామన్నారు. శుక్రవారం అయన గుంటూరు జిల్లా నేలాపాడు లో నిర్వహించిన డ్వాక్రా మహిళల పసుపు-కుంకుమ సభలో ప్రసంగించారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా అన్ని పనులు ఇంట్లోనే చేసుకోవచ్చన్నారు. ఉమ్మడి ఏపీలో డ్వాక్రా సంఘాలను అభివృద్ది చేశానన్నారు. ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలనే డ్వాక్రా మహిళలకు ‘పసుపు – కుంకుమ’ పథకం పెట్టానని అయన అన్నారు. అక్కలు, చెల్లెళ్లు ఉండగా ఉన్నంతవరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని విశ్వాసం వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలకు మూడు విడతలుగా రూ.10వేలను చెక్కుల రూపంలో అందజేస్తామన్నారు. మూడు నెలల్లో రూ.9400కోట్లు అందజేస్తామని, ఏప్రిల్ లోపు మహిళలు డబ్బులు డ్రా చేసుకునేలా పసుపు-కుంకుమ అమలు చేస్తామన్నారు. ఎప్పటికీ తన మనసులో డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రత్యేకస్థానం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో జననాల సంఖ్య తక్కువగా ఉందని, ఇద్దరు కాదు.. నలుగురిని కన్నా ఫర్వాలేదని ఆయన అన్నారు.