యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
వాగ్గేయకార చక్రవర్తి సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం సంకీర్తనల స్వరమాల వేసి నివాళులు అర్పించింది. ఆయన 172వ పుష్యబహుళ పంచమి ఆరాధనోత్సవాన్ని శుక్రవారం ఉదయం 8.00 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో అంగరంగ వైభవంగా నిర్వహించింది. శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, శ్రీవేంకటేశ్వర నాదస్వర పాఠశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో సంగీత విద్వాంసులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా ఉదయం 8.00 గంటలకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలోని శ్రీ విఘ్నేశ్వర, హనుమత్సమేత సీతారామలక్ష్మణులకు, శ్రీ వేంకటేశ్వరస్వామివారికి, శ్రీత్యాగరాజస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నాదస్వర పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులతో మంగళవాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఉదయం 10.00 నుండి 11.15 గంటల వరకు శ్రీ వేంకటేశ్వర నాదస్వర పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులచే నాదస్వర కచ్చేరి నిర్వహించారు. ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు శ్రీ ఎస్.వి.సంగీత నృత్య కళాశాల అధ్యాపకులచే ''శ్రీ త్యాగరాజ విరచిత సంపూర్ణరామాయణ కృతులు'' సుమధురంగా ఆలపించారు. కాగా, మధ్యాహ్నం 3.00 నుండి సాయంత్రం 4.15 గంటల వరకు ఎస్.వి.సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులచే నాదస్వర కచ్చేరి నిర్వహించారు. సాయంత్రం 4.30 నుంచి 5.15 గంటల శ్రీ ఎస్.వి.సంగీత నృత్య కళాశాల అధ్యాపకులచే ''శ్రీ త్యాగరాజ విరచిత ఉత్సవ, దివ్యనామ సంకీర్తనల'' బృందం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు వీణ, వేణువు, మృదంగం, తదితర వాయాద్యాలతో నాదనీరాజనం నిర్వహించారు.