యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
భారత్ జట్టులో స్థానం కోసం పోటీ పెరిగిందని సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో నేపియర్ వేదికగా గత బుధవారం జరిగిన తొలి వన్డేలో అజేయ అర్ధశతకం బాదిన ధావన్.. భారత్‌కి అలవోక విజయాన్ని అందించాడు. దీంతో.. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో వన్డే శనివారం ఉదయం జరగనుంది.. భారత్ జట్టులోకి గత ఏడాది ఆరంగేట్రం చేసిన రిషబ్ పంత్ ఇప్పటికే మెరుపు శతకాలతో టీమ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగా.. యువ ఓపెనర్ పృథ్వీషా ఆడిన తొలి టెస్టులోనే శతకం సాధించి సీనియర్ ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌కి గట్టి పోటీగా మారాడు. మరోవైపు ఓపెనర్ మయాంక్ అగర్వాల్, హనుమ విహారిలు నిలకడగా రాణిస్తుండగా.. శుభమన్ గిల్, విజయ్ శంకర్ తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. జట్టులో ఎవరి స్థానానికీ భరోసా లేదని ధావన్ చెప్పుకొచ్చాడు.మునుపటితో పోలిస్తే ఇప్పుడు యువ క్రికెటర్లలో పరిణతి కనిపిస్తోంది. ఎంతలా అంటే.. వారు సీనియర్ క్రికెటర్లకే గట్టి పోటీనిస్తున్నారు. పృథ్వీషానే చూడండి.. అరంగేట్రం టెస్టులో వెస్టిండీస్‌పై శతకం, ఆ తర్వాత మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాడు. టీమ్‌లో 15 మంది ఆటగాళ్లే ఉన్నా.. తుది జట్టు కోసం పోటీ తీవ్రంగా ఉంది. న్యూజిలాండ్ పరిస్థితులు ఆస్ట్రేలియాని పోలి ఉంటాయి. గతంలో నేను ఇక్కడ పర్యటించాను. కాబట్టి.. ఆ అనుభవం నాకు ఇప్పుడు కలిరానుంది’ అని ధావన్ వెల్లడించాడు.