యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలంగాణలోని హైదరాబాద్ లో ఉన్న పాతబస్తీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్, పట్టణ ప్రణాళిక ప్రిన్సిపల్ సెక్రటరి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్, ఇతర అధికారులతో కలిసి పాతబస్తీలో సాగుతున్న పనులను సమీక్షించారు. ఈరోజు ఉదయాన్నే మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో కలిసి అరవింద్ కుమార్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అరవింద్ కమార్ ను తన రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై ఎక్కించుకున్న ఒవైసీ.. స్వయంగా నడుపుకుంటూ పనులు జరుగుతున్న ప్రాంతానికి తీసుకెళ్లారు.
పాతబస్తీలో ప్రభుత్వం చేపడుతున్న బహదూర్ పురా, ఆరంఘర్-జూ పార్క్ మార్గంలో నిర్మిస్తున్న వ్యూహాత్మక రోడ్డు నిర్మాణాలను, మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల్లో పురోగతిని ఒవైసీ, అధికారులు ఈ సందర్భంగా సమీక్షించారు. కాగా, ఐఏఎస్ అధికారితో కలిసి స్వయంగా తన పార్లమెంటరీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ఒవైసీ పరిశీలించడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు తాను పాతబస్తీలో అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహించినట్లు అరవింద్ కుమార్ ట్విట్టర్ లో తెలిపారు. ఈ ట్వీట్ కు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేశారు.