యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం పంచాయితీ కొలిక్కివచ్చింది. ఈ అసెంబ్లీ సీటుకు పోటీ పడుతున్న ఇద్దరు నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సమావేశమై రాజీ కుదిర్చారు. కడప జిల్లాలో జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం కీలకం కావడంతో ఆ సీటు కోసం మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పోటీ పడటం తెలిసిందే. ఇద్దరూ అసెంబ్లీ సీటు తమదే నంటూ ప్రచారం చేసుకోవడంతో టీడీపీ అధిష్ఠానానికి సమస్యగా మారింది. సీట్ల ఖరారు ప్రక్రియ ప్రారంభించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు కూడా అయిన చంద్రబాబుకు ఈ వ్యవహారం సమస్యగా మారడంతో ఇద్దరితో బుధవారం సమావేశమై చర్చించారు. మరోసారి సాయంత్రం చర్చించేందుకు నిర్ణయించినప్పటికీ, రామసుబ్బారెడ్డి రాకపోవడంతో గురువారానికి వాయిదా పడింది. ఉదయం వీరిద్దరితో అసెంబ్లీ సీటు వ్యవహారం ముఖ్యమంత్రి చర్చించారు.ఇద్దరూ అసెంబ్లీ సీటునే కోరడంతో ముఖ్యమంత్రి కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒకరికి ఎమ్మెల్యే, మరొకరికి ఎంపీ సీటు ఇచ్చే ప్రతిపాదనకు అంగీకరించి, మళ్లీ అసెంబ్లీ సీటు కోసం పట్టుబట్టడం ఏమిటని ప్రశ్నించినట్లు తెలిసింది. పార్టీ అవసరాల దృష్ట్యా కలిసి పని చేయాలని, పార్టీ ఆదేశాలను అనుసరించాలని ముఖ్యమంత్రి నచ్చజెప్పారు. చర్చల అనంతరం వారిద్దరూ కలిసి మీడియాతో మాట్లాడుతూ ఎవరికి సీటు ఇచ్చినా, పార్టీ గెలుపునకు పని చేస్తామని తెలిపారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. త్వరలోనే జమ్మలమడుగు ఎమ్మెల్యే, కడప ఎంపీ సీటును కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటిస్తారన్నారు. కాగా, మంత్రి ఆదినారాయణరెడ్డిని కడప ఎంపీగా, జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి బరిలోకి దించే అవకాశం ఉందని తెలుస్తోంది.సీఎంతో సమావేశం అనంతరం కడప జిల్లా నాయకులంతా విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇద్దరూ జమ్మలమడుగు టిక్కెట్ కోసమే పట్టుబట్టాం. చివరకు నిర్ణయాధికారాన్ని ముఖ్యమంత్రికే విడిచిపెట్టాం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. నియోజకవర్గంలో మా పార్టీకి చెందిన నాయకులతోనూ మాట్లాడుకుంటాం. వారంలో అంతా కొలిక్కి వస్తుంది’’ అని మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. ‘‘తెదేపా ఆవిర్భావం నుంచీ మా కుటుంబం పార్టీకి సేవలందిస్తోంది. మా చిన్నాన్న శివారెడ్డి ఎన్టీఆర్ హాయంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేశారు. నేను రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశాను. కడప లోకసభ స్థానానికి పోటీ చేస్తే గెలుస్తామా? ఓడిపోతామా? అన్నది సమస్య కాదు. మాకు జమ్మలమడుగు నియోజకవర్గం ముఖ్యం. అదే విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పాను. ఇప్పుడిక ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. మా కార్యకర్తలతో విడిగా సమావేశం ఏర్పాటు చేసుకుని వారిని ఒప్పిస్తాం’’ అని రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు