యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
గాంధీ కుటుంబ వారసురాలు ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ బాధ్యురాలిగా నియమించడం వ్యూహాత్మక ఎత్తుగడ అంటున్నారు. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ లో బలంగా ఉన్న కాంగ్రెస్ గత కొన్నేళ్లుగా అక్కడ చోటు లేకుండా పోయింది. 2014 ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ మొత్తం కాంగ్రెస్ కు 7.5 శాతం ఓట్లు సాధిస్తే…. అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఆ ఓటు బ్యాంకు 6 శాతానికి ఓటు పడిపోయింది. దీంతో కాంగ్రెస్ కొంత ఆలోచనలో పడింది. అది పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో పునాదులు కోల్పోతే దేశ ప్రధాని పదవి చేజారిపోతుందన్నది కాంగ్రెస్ పార్టీకి తెలియంది కాదు. అందుకే ఉత్తరప్రదేశ్ లోని 80 లోక్ సభ స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది.ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీని గాడిన పెట్టే పనిలో ఉన్నారు. తాజాగా గాంధీ కుటుంబం నుంచి ప్రియాంకా గాంధీని నేరుగా ఉత్తరప్రదేశ్ కే వచ్చే ఎన్నికల ప్రచారానికి పరిమితం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ర్యాలీలు, బహిరంగ సభలతో హోరెత్తించడమే కాకుండా ఎన్నికలకు ముందు పార్టీకి హైప్ తేవాలని పార్టీ నిర్ణయిస్తుంది. నాయనమ్మ ఇందిరాగాంధీని అచ్చుగుద్దినట్లు ఉంటే ప్రియాంక ప్రచారంతో ఊపు రావడం ఖాయమని, ప్రియాంక రాజకీయ రంగ ప్రవేశంతో కేవలం ఉత్తరప్రదేశ్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.ప్రియాంక గాంధీకి ప్రస్తుతం తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాన్ని అప్పగించారు. ప్రియాంకకు బాధ్యతలు చూస్తున్న తూర్పు ప్రాంతంలో 40 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహించే వారణాసితో పాటు, లక్నో, గోరఖ్ పూర్ వంటి కీలక పార్లమెంటు స్థానాలు కూడా ఉండటం విశేషం. దీంతో పాటు ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతంలో బీజేపీతో పాటు బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు బలంగా ఉన్నాయి. తూర్పు నుంచే ఈసారి ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని అఖిలేష్ యాదవ్, మాయావతి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని ప్రియాంకకు అప్పగించడంతో బీఎస్పీ, ఎస్పీ ఓట్లకు కూడా గండి పడే అవకాశముందంటున్నారుప్రియాంకకు ప్రచారం చేయడం కొత్తేమీ కాదు. ఆమె 1999 ఎన్నికల నుంచే అమేధీ, రాయబరేలీ పార్లమెంటు స్థానాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. చరిష్మా ఉన్న ప్రియాంక రాకతో కాంగ్రెస్ బలం పెరుగుతుందని అంచనా వేస్తున్నా గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక ప్రభావం పెద్దగా కన్పించలేదన్నది అధికార బీజేపీ నేతల వాదన. గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రియాంక రాయబరేలి, అమేధీ పార్లమెంటు స్థానాల పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో పర్యటించినా ఆశించిన ఫలితాలు రాలేదని అంటున్నారు. మొత్తం మీద ప్రియాంక రాజకీయ భవిష్యత్తు ఈ లోక్ సభ ఎన్నికల్లో తేలిపోతుందన్న వాదనలు కూడా ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల ఫలితాలను బట్టే ప్రియాంక రాజకీయంగా కంటిన్యూ అవ్వాలా? వద్దా? అన్నది కూడా తేల్చుకోనున్నారు.