యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలుగుదేశం పార్టీలోకి కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేరబోతున్నారు. కీలక మంత్రి ఒకరు ఆయనతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్టు సమాచారం. దాదాపు ఆయన సైకిల్ ఎక్కేందుకు అంగీకరించారని అయితే లాంఛనంగా అంగీకరించి మీడియా ఎదుట సానుకూలత తెలియజేయటమే మిగిలిందని తెలుస్తోంది. ఇప్పటికే బెజవాడలో వంగవీటి మోహన్‌రంగా తనయుడు రాధా కూడా టీడీపీ పట్ల పాజిటివ్ ధోరణి వ్యక్తంచేశాడు. త్వరలో తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానంటూ స్పష్టంచేశాడు. తెలుగుదేశం పార్టీ తన తండ్రి రంగా మరణానికి కారణం కాదంటూ ప్రకటించిన నేపథ్యంలో రాధా తప్పకుండా టీడీపీ వైపు మొగ్గుచూపుతాడంటూ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముద్రగడ కూడా బాబు నాయకత్వం వైపు మొగ్గుచూపటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఏపీలో కాపుల రిజర్వేషన్ అంశం ఎప్పటి నుంచో నలుగుతున్న విషయం దీనికి కోట్ల విజయబాస్కర్‌రెడ్డి హయాంలో కొంత ముందుకు జరిగినా తరువాత వచ్చిన నేతలు పూర్తిగా పక్కన పడేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కాపుల రిజర్వేషన్ హామీ ఇచ్చారు. దీనికోసం కమీషన్ ఏర్పాటు చేసినా దానిపై కూడా నీలినీడలు అలుకుమున్నాయి. కేంద్రానికి పంపిన నివేదికలోనూ తప్పులున్నాయంటూ ఆరోపణలు వినిపించాయి. కానీ.. కాపు కార్పొరేషన్ ద్వారా కాపు విద్యార్థులు, నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చారు. ఇటువంటి సమయంలో కేంద్రం తెచ్చిన 10 శాతం ఓబీసీ రిజర్వేషన్‌లో 5 శాతం కాపులకు కేటాయిస్తామంటూ బాబు హామీనిచ్చారు. ఇది కాపులకు ఉపయోగకరమైన అంశం కావటంతో ముద్రగడ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి చినరాజప్ప స్వయంగా పద్మనాభంతో చర్చలు జరిపారట. కాపుల రిజర్వేషన్ అంశం సద్దుమణగటం, వంగవీటి వారసుడు కూడా పార్టీ మారట.. వైసీపీ అధినేత జగన్ కాపుల రిజర్వేషన్‌పై విముఖత తెలియజేయటం వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. కాపులకు మేలు చేసేందుకు చంద్రబాబు నాయకత్వం అవసరమనే విషయాన్ని తెరమీదకు తేనున్నారు. దీని ద్వారా తనపై పెల్లుబుకే వ్యతిరేకతను అధిగమించటంతోపాటు.. పవన్ నుంచి టీడీపీ చీల్చుకునే ఓట్లను కూడా రాబట్టవచ్చనేది వ్యూహంగా తెలుస్తోంది. ఇవన్నీ నిజమైతే.. ఫిబ్రవరి మొదటి వారంలో 14 రాజకీయపార్టీలతో జరిగే సభా వేదికపై ముద్రగడ టీడీపీ కండువా కప్పుకుంటారని ఊహాగానాలు ఊపందుకున్నాయి.