Highlights
- ప్రధానికే అపాయింట్‌మెంట్ ఇవ్వరట..!
- ఆశ్చర్యపోయిన బీజేపీ నేతలు
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్‌మెంట్ ఇవ్వదంటా..ఈ వార్త మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మీడియా మేనేజ్‌మెంట్‌లో సిద్ధహస్తుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు ఓ హాట్ న్యూస్ ను మీడియాకు లీక్ చేయించారన్న విమర్శలు వినవస్తున్నాయి.. ఏదైతేనేం మీడియా మాత్రం చెలరేగిపోతోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు రావాలనుకుంటున్నారని, కానీ రాష్ట్రంలో ఎలాంటి శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలూ లేవని ప్రధానమంత్రి కార్యాలయానికి ఏపీ ప్రభుత్వం సమాచారం పంపించిందని ఆ లీకు వార్త సారాంశం.
ఔరా నారావారు ఎంత సమర్థులు అని బీజేపీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్‌కి రావాలనుకుంటున్నారని, వచ్చి ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొని ఆ సందర్భంగా చేసే ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమేం చేసిందో చెప్పాలను కుంటున్నారని తెలిసిందట. ఆ అవకాశం ప్రధానికి ఇవ్వడం ఇష్టం లేకనే రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాలూ లేవని తెలిపిందట.
వాస్తవానికి ప్రధానమంత్రి వస్తానంటే రాత్రికి రాత్రి ఏదో ఒక పెద్ద ఈవెంట్‌ను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా భారీ కార్యక్రమం నిర్వహించడం చంద్రబాబుకు చిటికెలో పని. కానీ ఆయన వద్దనుకుంటున్నారు కాబట్టే ప్రధానమంత్రికి…. ఏపీకి రావడానికి అపాయింట్‌మెంట్ దొరకడం లేదట. నమ్మితే నమ్మండి.. లేదంటే మీ ఇష్టం.. చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం ఇలాంటి లీకు వార్తలనే ప్రచారం చేస్తుంది.
అన్ని రంగాలలోనూ అవినీతి విశృంఖలంగా మారిపోవడంతో ముఖ్యమంత్రికి ప్రధాని నరేంద్ర మోదీ 16 నెలల పాటు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా దూరంగా ఉంచారు. ఆ సమయంలో చంద్రబాబు కూడా ప్రధానిని కలుసుకోవడానికి, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పడానికి ఎలాంటి గట్టి ప్రయత్నాలూ చేయలేదు. ఇపుడు ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఇలాంటి సత్యదూరమైన వార్తలను ప్రచారం చేయిస్తున్నారని రాజకీయ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.