ఆంధ్రప్రదేశ్ లో గత నాలుగేళ్లలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని గవర్నర్ నరసింహన్ అన్నారు. శనివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ నరసింహన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆర్మీ, వివిధ పోలీసు బెటాలియన్ల కమాండెంట్లు, ఏపీ స్పెషల్ పోలీస్, అబ్కారీ శాఖ సహా పలు విభాగాలు కవాతు నిర్వహించారు. వేడుకల్లో గవర్నర్ నరసింహన్ 13 కంటింజెంట్స్ గౌరవ వందనం స్వీకరించారు. వేడుకల్లో మంత్రులు చినరాజప్ప, దేవినేని, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావులు హాజరయ్యారు. గవర్నర్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. సాంకేతికతను జోడించి ఉత్పాదకతను పెంచుతోందన్నారు. విభజన కష్టాలను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో తొలిస్థానంలో ఉన్నామన్నారు. జనవరి నుంచి పెన్షన్లను 2వేలకు పెంచామన్నారు. నాలుగేళ్లలో 10.52 శాతం వృద్ధిరేటు సాధించామన్నారు. వ్యవసాయ ఆధారిత రంగాల్లో 11 శాతం వృద్ధిరేటు ఉందన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ప్రతి ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం అందించిన స్కీము ద్వారా 11.2 లక్షల మంది అర్చక కుటుంబాలకు లబ్ది చేకూరింది. *ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు 65 శాతం నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. ఎపి టూరిజం 200 ప్రాజెక్టులను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కోర్నారు.