YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లాన్స్‌నాయ‌క్‌ కు భారత ప్రభుత్వం 'అశోక చ‌క్ర' అవార్డు

లాన్స్‌నాయ‌క్‌ కు భారత ప్రభుత్వం 'అశోక చ‌క్ర' అవార్డు
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

లాన్స్‌నాయ‌క్‌ నాజిర్ అహ్మద్ వనీ కుటుంబ సభ్యులకు భారత ప్రభుత్వం 'అశోక చ‌క్ర' అవార్డును ప్రదానం చేసింది. రాజ్‌ప‌థ్‌లో జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ అమర జవాను అహ్మద్ వనీ భార్య, తల్లికి ఈ గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేశారు. గతంలో ఉగ్రవాదిగా ఉన్న అహ్మద్ వనీ.. తర్వాత ఉగ్రవాదాన్ని వీడి.. సైన్యంలో చేరాడు. సైన్యంలో ఎంతగానో సేవ చేశాడు. చివరకు కర్తవ్య నిర్వహణలో ముష్కరులతో పోరాడుతూ అమరుడయ్యాడు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సైన్యంలోని అత్యున్నత పురస్కారమైన అశోక చక్రతో సత్కరించింది. ఆయన కుటుంబ సభ్యులకు పురస్కారాన్ని అందించింది. 'అశోకచక్ర' అందుకున్న మొదటి కశ్మీరీగా అహ్మద్ వానీ నిలిచారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాకు చెందిన నజీర్‌ అహ్మద్‌ వనీ గతంలో ఓ ఉగ్రవాది. 1990లలో ఉగ్రకార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న వనీ ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని పూర్తిగా మారిపోయాడు. పోలీసుల ముందు లొంగిపోయి.. 2004లో 162వ టెరిటోరియల్‌ ఆర్మీ బెటాలియన్‌లో చేరారు. అప్పటి నుంచి సైన్యానికి ఎంతో సేవ చేశారు. ఉగ్రవాదులపై పోరులో చూపించిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా రెండుసార్లు (2007, 2018) సేనా పతకం కూడా అందుకున్నారు. కాగా గతేడాది నవంబర్ 25న సోపియాన్ జిల్లా హీరాపూర్ గ్రామంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వనీ ప్రాణాలు కోల్పోయాడు. శరీరంలో బుల్లెట్లు దిగి తీవ్రంగా గాయపడినా పోరాట పఠిమను చూపించాడు. వీరోచితంగా పోరాడి ఇద్దరు ఉగ్రవాదులను అంతమొందించాడు. మరొక ఉగ్రవాదిని తీవ్రంగా గాయపరిచాడు. ముష్కరులను మట్టుబెట్టేందుకు తన ప్రాణాలు అర్పించిన అహ్మద్‌ వనీ ధైర్యసాహసాలకు మరణానంతరం అశోక్‌ చక్ర లభించింది. 

Related Posts