దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అన్ని రంగాల్లోనూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుదామని ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పిలుపునిచ్చారు. 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ రాజ్యాంగంతోనే బడుగు, బలహీన వర్గాల రక్షణ, హక్కులు సాధ్యమయ్యాయన్నారు. 70 ఏళ్ల కింద వెనుకబడిన దేశంగా ఆవిర్భవించిన భారతదేశం నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు రావడం గర్వకారణమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనాంతరం నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడి ఐదేళ్లయ్యిందన్నారు. ఈ కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. ఎన్ని కష్టాలున్నా పోలవరం, రాజధాని నిర్మాణాలతో పాటు పేదల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుదామని ఆయన పిలుపునిచ్చారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ, డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగం రూపొందిందన్నారు. భారతదేశంతో పాటు స్వాతంత్ర్యం పొందిన ఎన్నో దేశాలు నేడు నియతంతృత్వ పాలనలో ఉన్నాయన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో రాజ్యాంగం పాత్ర ఎంతో ఉందన్నారు. మహాత్మగాంధీ ఆశయ సాధనకు సీఎం చంద్రబాబునాయుడు ఎంతో కృషి చేస్తున్నారు. గ్రామాల్లో రోడ్లు, కాలువలు, పంచాయతీలు, అంగన్వాడీ భవనాలు, స్మశాన వాటికల నిర్మాణం వంటి ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు. అంతకుముందు అసెంబ్లీ భద్రతా సిబ్బంది నుంచి స్పీకర్ కోడెల శివప్రసాదరావు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మువ్వన్నెల జెండాను స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆవిష్కరించారు.
ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు...
గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నర్సింహాన్ ప్రసంగంతో ఈ నెల 30 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. 31న సిట్టింగ్ సభ్యుల మృతికి సంతాపం తెలపి సభ వాయిదా వేస్తామన్నారు. 1, 2, 3 తేదీల్లో సెలవు దినాలని, 4 నుంచి 8వ తేదీ వరకూ సమావేశాలు వరుసుగా జరుగుతాయన్నారు. ఈ 5 రోజుల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలపడం తీర్మానంతో పాటు ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. వచ్చే నెల 8వ తేదీన సభ నిరవధికంగా వాయిదా పడుతుందని, అత్యవసరమైతే తప్ప ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు.