ఈ నెల 29, 30, 31 తేదీలలో ఏలూరులో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర 14వ మహాసభలకు మహిళలు పెద్దయెత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షురాలు నల్లా భ్రమరాంబ పిలుపునిచ్చారు. స్ధానిక సిపిఐ కార్యాలయంలో శనివారం మహాసభల గోడపత్రికలను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల వాగ్ధానాలు అమలు చేయకుండా నాలుగున్నరేళ్ళు గడిపేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయనడంతో డ్వాక్రా మహిళలను మరోసారి మోసగించేవిధంగా ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తున్నారని దుయ్యబట్టారు. స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్ళు కావస్తున్నా మహిళలపై అత్యాచారాలు నిరోధించడంలో పాలక పక్షాలు విఫలమయ్యాయన్నారు. మహిళా చట్టాలు అమలు చేయకపోవడంతో మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సమాఖ్య జిల్లా గౌరవ అధ్యక్షురాలు యడ్ల లక్ష్మి, సేపేని రమణమ్మ, మొగల్ జీనత్ బేగం తదితరులు పాల్గొన్నారు.