Highlights
- క్రెడిటంతా నువ్వే తీసుకో జగన్
- జగన్ ప్రతి సవాల్‌ను స్వీకరించిన పవన్
- వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదు
- జనసేన అధినేత పవన్ కళ్యాణ్
పార్లమెంటులోమార్చి 5వ తేదీన వైసీపీ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంతో ముందుకు రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సవాల్ చేశారు. మార్చి 4న తాను ఢిల్లీకి వస్తానని చెప్పారు.పార్లమెంటులో తాము అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమని, కానీ అందుకు కావాల్సిన మద్దతును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకు వస్తారా అన్న వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి సవాల్‌ను పవన్ కళ్యాణ్ స్వీకరించారు. జగన్ అవిశ్వాస తీర్మానం పెడితే, తాను ఎంపీల మద్దతు తీసుకు వస్తానని జనసేనాని చెప్పారు. దమ్ముంటే అవిశ్వాసం పెట్టాలన్నారు. జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే కేంద్రానికి ఎదురు తిరగాలన్నారు. తద్వారా జగన్ సవాల్‌కు పవన్ ధీటుగా స్పందించారు.
ఇందుకు 50 మంది నుంచి 80 మంది వరకు మద్దతిస్తారని, అసలు ఒక్కరైనా అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చునని చెప్పారు. వామపక్ష ఎంపీలతో పాటు కన్నడ, తమిళ ఎంపీల మద్దతు తాను కోరుతానని చెప్పారు. అవసరమైతే కర్నాటక వెళ్తానని చెప్పారు. అంటే కాకుండా రాహుల్, అఖిలేష్, ముస్లీం, తెరాస మద్దతు కూడా కోరుదామని పవన్ అన్నారు. అవిశ్వాసం విషయంలో వైసీపీ వెనక్కి వెళ్తే కనుక అప్పుడు తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుతుందన్నారు. జగన్ సవాల్ మేరకు తానూ వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీకి మీరు భయపడుతున్నట్లుగా కనిపిస్తోందని చంద్రబాబు నాయుడును ఉద్దేశించి పవన్ అన్నారు. ప్లకార్డులు, విచిత్ర వేషధారణ నిరసనలతో ప్రయోజనం ఉండదని చెప్పారు. టీడీపీ వాళ్లు తన మిత్రులు అంటున్నారని, అది కూడా తెలుస్తుందని చెప్పారు.ఇది ఏ ఒక్కటి పోరాటం కాదన్నారు. ఎవరు అవిశ్వాసం పెడతారా అని జనంతో పాటు తాను కూడా ఎదురు చూస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీకి ప్రయోజనాల విషయంలో తనవంతు ఏ సాయమైనా చేసేందుకు తాను సిద్ధమని పవన్ కళ్యాణ్ చెప్పారు.