యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
విజయవాడలో ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన భవనాలు పదుల సంఖ్యలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ప్రభుత్వ భవనాలు, కల్యాణమండపాలు, సామాజిక భవనాలు ఇలాంటి వేటికీ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా నిర్మిస్తున్నారు. ప్రభుత్వ భవనమేగా.. అధికారులు, నాయకులు అండగా ఉన్నారనే ధైర్యంతో వీటిని నిర్మిస్తున్న ప్రైవేటు కాంట్రాక్టర్లు ఎలాంటి అనుమతులూ తీసుకోవడం లేదు. నగరపాలక సంస్థ అధికారులకు సైతం ఇలాంటి వాటిని నిలదీయడం, చర్యలు చేపç్టడం వంటివి చేసే ధైర్యం లేకపోతోంది. దీంతో నగరపాలక సంస్థ ఖజానాకు రూ.కోట్ల గండిపడుతోంది. నగరపాలక సంస్థ పరిధిలో భవన నిర్మాణాలకు నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. వాటి అమలుకు విధివిధానాలూ ఉన్నాయి. కానీ.. వాటిని అమలు చేయాలంటే మాత్రం అధికారులకు సవాలక్ష సమస్యలు ఎదురొస్తున్నాయి. కొందరు సిబ్బంది చేతివాటానికి అలవాటు పడగా.. మరికొందరు ఒత్తిళ్లకు లోనవ్వాల్సి వస్తోంది. దీంతో నిబంధనలు గాలికొదిలేశారు. భవనాలను గాలిమేడల్లా నిర్మిస్తున్నారు. ఇదే అదనుగా.. విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ.. అక్రమ నిర్మాణాలు సైతం భారీగా పెరిగిపోతున్నాయి.
వాణిజ్య భవనాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలకు ఖచ్చితంగా సెల్లార్ పార్కింగ్ ఉండాలని చెప్పే అధికారులు.. వారు నిర్మించే భవనాలకు మాత్రం నిబంధనలు మరిచిపోతున్నారు. నగరలోని పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న 90శాతం ప్రభుత్వ నిర్మాణాల పరిస్థితి ఇలాగే ఉంది. పనిలో పనిగా నగరపాలక, నీటిపారుదల విభాగాలకు చెందిన స్థలాల్లోనే.. కాలవగట్లపైనా నిర్మాణాలు యథేచ్ఛగా చేస్తున్నారు. ఇదేంటని ఎవరైనా నిలదీస్తే.. కట్టేది సామాజిక భవనాలు, ప్రభుత్వ అవసరాల కోసమే కదా.. అంటూ సమాధానాలు చెప్పే పరిస్థితి ఉంటోంది. విజయవాడ పట్టణ ప్రణాళికా విభాగం ఇలాంటి వాటిని పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. కమిషనర్‌గా ఐఏఎస్ అధికారులు ఉన్నా.. ఇక్కడ ఏం చేయలేని పరిస్థితి ఉంటోంది. కొందరు ప్రణాళికాధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తూ వీఎంసీ ఆదాయానికి నష్టం వచ్చేలా వ్యవహరించడమే కాదు.. ప్రజా ప్రయోజనాలను తుంగలో తొక్కి సొంత లబ్ధి చూసుకుంటున్నారు.
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ, వాణిజ్య భవనాలు, పోలీసుస్టేషన్లు, కల్యాణమండపాలు, పీఎంఏవై, ఎన్టీఆర్ గృహాలు వంటి నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదు. అసలు నగరవ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నారనే లెక్కలు నగరపాలక అధికారుల వద్ద లేవు. నిబంధనలు పాటించకపోవడం, సెల్లార్లు నిర్మించకపోవడం, సెట్‌బ్యాక్‌లు వదలకపోవడంతో పాటు రోడ్డు, కాలువలు ఆక్రమించి చేపట్టే నిర్మాణాల వల్ల భవిష్యత్తులో విజయవాడ నగరానికి పెను ముప్పు పొంచి ఉంది. వాహనాలు పెట్టేందుకు ఇప్పటికే చోటులేక, రోడ్డుపై ప్రజలు నడిచేందుకు వీలులేక బిక్కుబిక్కుమంటూ రాకపోకలు చేయాల్సి వస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగితే అగ్నిమాపక యంత్రం, అంబులెన్స్ వెళ్లే దారి కూడా నగరంలోని సగం ప్రాంతాల్లో లేదు. ప్రస్తుతం మిగిలిన ఇరుకు గళ్లీల్లోనూ విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్థులను నిర్మిస్తూ వెళితే.. పరిస్థితి పూర్తిగా దారితప్పుతుంది.