యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
గుంటూరు, జనవరి 28 (న్యూస్ పల్స్): తీర ప్రాంతంలో దొరువుల నీటితో ఏడాది పొడవునా కూరగాయ, పూల తోటలు సాగు చేస్తూ రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. వేసవిలోనూ కూరగాయల కొరత లేకుండా చేస్తున్నారు. దొరువుల వద్ద బోర్లు తవ్వి మోటార్ల ద్వారా ఆ నీటిని తోడి పంటలకు తడులు అందిస్తున్నారు. ఇసుక భూముల్లో ఈ తరహా సాగు అన్నదాతలకు లాభదాయకంగా ఉంది.
తీరప్రాంత నియోజకవర్గాలు బాపట్ల, రేపల్లెలలో 24 వేల ఎకరాల్లో ఇసుక భూములు ఉన్నాయి. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. ఐదారడుగులు తవ్వితేనే నీరు వస్తుంది. రైతులు నలభై, యాభై ఏళ్ల నుంచి తమ పొలాల్లో ఐదారడుగుల లోతున దొరువులు తవ్వి ఆ నీటితో పంటలు పండిస్తున్నారు. కాలక్రమేణా సాగునీటి, పంట కాల్వలు తవ్వారు. తీర గ్రామాలకు కాల్వల ద్వారా నీరు అందేది. ఈ నీటితో వరి, అపరాలు, వేరుశనగ సాగు చేపట్టేవారు. రెండేళ్లలో పరిస్థితులు కొంత మారాయి. కాల్వల ద్వారా చివరి ఆయకట్టు భూములకు సాగునీరు సక్రమంగా రావటం లేదు. నీరు వచ్చినా అరకొరగానే అందుతోంది. సాగునీటి వసతి లేని ప్రాంతాల్లో మెట్టభూముల రైతులు దొరువుల నీటితో ఏడాదిలో మూడు పంటలుగా వేరుశనగను సాగు చేసి మంచి దిగుబడులు సాధించి ఆదాయం అర్జిస్తున్నారు. పచ్చిమిర్చి, వివిధ రకాల కూరగాయలు, పూలు సాగు చేస్తున్నారు. కర్లపాలెం, బాపట్ల, పీవీపాలెం, చెరుకుపల్లి, నగరం, నిజాంపట్నం మండలాల్లో దొరువుల నీటితో ఉద్యాన పంటలు పండిస్తున్నారు. దొరువులు తవ్వటం వల్ల వర్షాలు కురిసిన సమయంలో నీరంతా అందులో చేరి భూమిలోకి ఇంకి భూగర్భ జలాల మట్టాలు పెరుగుతున్నాయి. పైపొర నీటిని పంటలు పండించటానికి మోటార్లతో తోడిసినా, దొరువుల ద్వారా తిరిగి వర్షపు నీరు ఈ స్థానంలో చేరి ఉప్పునీటిని పైకి రాకుండా చేస్తున్నాయి. వర్షాకాలం, శీతకాలంలో వాన నీరు ఈ దొరువుల్లో నిల్వ ఉండి సాగునీరుగా ఉపయోగపడుతోంది.
బాపట్ల మండలంలో తూర్పు, పడమర పిన్నిబోయినవారిపాలెం రైతులు తమ పొలాల్లో దొరువులు తవ్వి ఈ నీటితో నారుమడులు పోశారు. దొరువు నీరు, కాల్వల నీటితో వరి సాగు చేపట్టారు. అక్టోబరు, నవంబరు నెలల్లో వర్షాలు కురవకున్నా, కాల్వల ద్వారా పూర్తిగా నీరు రాకున్నా దొరువుల నీటితో పంటకు తడులు ఇచ్చి కాపాడుకొన్నారు. కరవు సమయంలోనూ ఎకరాకు 30 నుంచి 35 బస్తాల వరకు దిగుబడి సాధించారు. రబీలో దోసకాయల సాగు చేపట్టి ఎకరాకు రూ.80 వేలకు పైగా ఆదాయం సాధిస్తున్నారు. ప్రస్తుతం తూర్పుబాపట్ల, పాండురంగాపురం, పడమర బాపట్ల, ఆసోదివారిపాలెం, మరుప్రోలువారిపాలెం, కొండుభొట్లవారిపాలెం, వెదుళ్లపల్లి, పొతురాజుకొత్తపాలెం, స్టూవర్టుపురం, కొత్త ఓడరేవులో ఖరీప్, రజీ సీజన్లతో పాటు వేసవిలోనూ కూరగాయల సాగు చేస్తున్నారు. సాధారణంగా వేసవిలో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గుతుంది. దిగుబడులు పడిపోయి ధరలు పెరుగుతాయి. దొరువుల వల్ల వేసవిలో కూరగాయలు, పూల తోటలకు అవసరమైన నీరు లభిస్తోంది.
బాపట్ల ఉప్పునీటి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు ఆధునిక దొరువు పరిజ్ఞానం రూపొందించారు. భూమిలో ఎనిమిది అడుగుల లోతున తవ్వి అందులో సిమెంటు వరలు వేశారు. దొరువు అడుగు భాగం నుంచి మధ్య వరకు భూమి పొరల్లో నుంచి పైపులు వేసి దొరువు బావిలోకి అమర్చారు. దీనివల్ల భూమి పొరల్లో ఉన్న నీరు ఈ పైపుల ద్వారా బావిలోకి వస్తుంది. మోటార్లతో నీరు తోడి మూడు పంటలు సాగు చేస్తున్నారు. ఈ పరిజ్ఞానం ద్వారా ఉప్పు నీరు దొరువుల ద్వారా పైకి రాకుండా ఉంటుంది. దొరువులు భూగర్భ జలాల మట్టాలు పెంచేందుకు దోహదపడుతున్నాయి.