యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కర్ణాటక రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ లోనే అసంతృప్తి ఎక్కువగా ఉందనుకుంటే… అతి తక్కువ సీట్లు సాధించి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న జనతాదళ్ ఎస్ లోనూ ముసలం పుట్టేలాకన్పిస్తుంది. బడ్జెట్ సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ అవిశ్వాసం తీర్మానం పెట్టే దిశగా అడుగులు వేస్తుంటే ‘‘మాకేంటి’’ అంటున్నారు జనతాదళ్ ఎస్ ఎమ్మెల్యేలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 37 సీట్లు మాత్రమే సాధించి అందలం ఎక్కిన కుమారస్వామి మంత్రి వర్గంలో తన వారికి చోటు కల్పించలేకపోయారు.కర్ణాటక రాజకీయాల్లో ఎవరినీ సంతృప్తి పర్చడం తేలిక కాదని అర్థమవుతోంది. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణతో కాంగ్రెస్ లో అసంతృప్తులు బాగానే బయటపడ్డాయి. నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వీరిని పక్కన పెట్టినా మరో 20మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమకు కుమారస్వామి సహకరించడం లేదన్నది వారి ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా మంత్రిపదవుల్లో కూడా సీనియర్లకు అన్యాయం జరిగిందని వారు బాహాటంగానే చెబుతున్నారు.తాజాగా జనతాదళ్ ఎస్ లోనూ విభేదాలు బయటపడుతున్నాయి. వాస్తవానికి ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో జనతాదళ్ ఎస్ కు రెండు మంత్రి పదవులు దక్కాల్సి ఉంది. బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్ ఆ పార్టీ అధినేత్రి మాయావతి సూచనతో రాజీనామా చేయడంతో ఆ ఖాళీ ఏర్పడింది. దీంతో రెండు మంత్రిపదవులను భర్తీ చేయకుండా కుమారస్వామి కాలయాపన చేస్తున్నారని జేడీఎస్ ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారని తెలిసింది. దేవెగౌడ దృష్టికి సయితం కొందరు నేతలు ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. అయితే విస్తరణ మళ్లీ చేపడితే కాంగ్రెస్ శాసనసభ్యుల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో కుమారస్వామి జంకుతున్నారు.అవకాశం ఉన్నా మంత్రి పదవులను భర్తీచేయకపోవడంపై కొందరు జేడీఎస్ నేతలు అసంతృప్తిగా ఉన్న విషయం బయటకు రావడంతో బీజేపీ కన్ను వారిపై పడిందంటున్నారు. సంకీర్ణ సర్కార్ ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితుల్లో వచ్చిన అవకాశాన్ని కూడా కుమారస్వామి వినియోగించుకోవడంలేదన్న విమర్శలు సొంత పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేలను కుమారస్వామి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి పదవులు ఇప్పటికిప్పుడు భర్తీ చేస్తే తలెత్తే పరిణామాలను వారికి వివరిస్తున్నారు. మొత్తం మీద జేడీఎస్ లోనూ అసంతృప్తులు తలెత్తడంతో కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి.