YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పశ్చిమలో క్లీన్ స్వీప్ పై టీడీపీ గురి

 పశ్చిమలో క్లీన్ స్వీప్ పై టీడీపీ గురి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

సంక్రాంతి పండగ ముగిసింది. అసలుసిసలైన ఎన్నికల పండగ రాబోతుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించేందుకు ‘సైకిల్‌’కు ఒకింత మరమ్మతులు చేపట్టబోతున్నారు. గడచిన ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో 14 స్థానాల్లో దూసుకుపోయిన విజయాన్ని మళ్ళీ అందుకోవాలని తహతహలాడుతోంది. ప్రస్తుత సిట్టింగ్‌ల జాతకాలు కొన్నింటిని త్వరలోనే మార్చబోతుంది. అరడజనుకు తగ్గకుండా సిట్టింగ్‌ల స్థానాల్లో మార్పులు, చేర్పులు ఉంటాయని పార్టీలో ఊహాగానాలు. సగానికి సగం రాజకీయ మార్పులు ఉండకపోవచ్చంటూ మరికొందరి వాదన. కాని ఈసారి కూడా ప్రజా మద్దతుతో అధికార పగ్గాలు చేజారిపోకుండా కాపాడుకునేందుకు క్షేత్రస్థాయి అభిప్రాయాలను టీడీపీ సేకరిస్తోంది.ఇప్పటివరకు ఐవీఆర్‌ఎస్‌ ద్వారా దఫాల వారీగా, నియోజకవర్గాల్లో నిర్వహించిన అభిప్రాయ సేకరణ నివేదికలు అధిష్ఠానం వద్ద సిద్ధంగా ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని.. తమకు కొత్తగా దరఖాస్తు చేసుకుని, ఆర్థికంగా, సామాజికంగా స్థోమత కలిగిన వారి వివరాలను క్రోడీకరించి త్వరలోనే మరోమారు అభిప్రాయ సేకరణకు దిగబోతుంది. దాదాపు సగానికి సగం స్థానాలను త్వరలోనే ప్రకటించేందుకు సిద్ధమవుతుంది. సీనియర్లు, వరుస విజయాలను అందుకున్న వారికి ఈ జాబితాలో చోటు దక్కే అవకాశం ఉంది. రెండు ఎంపీ స్థానాల్లో నరసాపురానికి కనుమూరి రఘురామకృష్ణంరాజు అభ్యర్థిగా ఇప్పటికే తెలుగుదేశం రంగంలోకి దింపింది.ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి మరోమారు సిట్టింగ్‌ ఎంపీ మాగంటి బాబుకు అవకాశం ఇస్తారా.. లేదా కొత్త ముఖం వైపు మొగ్గు చూపుతారా అనేది త్వరలో తేలబోతుంది. ఎంపీ మాగంటి బాబుకు ప్రత్యామ్నాయంగా ఇప్పటికే బోళ్ళ రాజీవ్‌ తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంత్రులు పితాని సత్యనారాయణ, కె.ఎస్‌.జవహర్‌ల విషయంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేవు. వీరిద్దరూ ఆచంట, కొవ్వూరు నుంచే తిరిగి పోటీకి సన్నద్ధంగా ఉన్నారు. ‘ఎవరో ఏదో అంటారు. నేను మాత్రం ఆచంట నుంచే పోటీ చేస్తా. ఈ విషయంలో మరో మాటలేదు. ఎవరో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు. అంతకంటే మించి సోషల్‌ మీడియా, ఫేస్‌బుక్‌లలో వచ్చేవన్నీ అభూతకల్పనలే. ఇక్కడ ఉన్నదంతా నా శ్రేయోభిలాషులు, నన్ను నమ్మిన కార్యకర్తలు. వారి కోసమే శ్రమిస్తా’ ఆచంట నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి పితాని తన వైఖరిని స్పష్టం చేశారు.

Related Posts